అందాన్ని తప్పించుకుని తిరుగుతున్న అదృష్టం!
- 'మజ్ను'తో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ
- ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచిన కళ్లు
- కుర్రకారు వైపు నుంచి ఫుల్ క్రేజ్
- పెద్ద సినిమాలతోను దక్కని ఫలితం
- వెనకబడిపోయిన సుందరి
ఇప్పుడంటే రాన్రాను తెరపై కథానాయికలకు చోటు లేకుండా పోతోందిగానీ, ఒకప్పుడు ముగ్గురేసి హీరోయిన్స్ సందడి చేసిన సినిమాలు ఉన్నాయి. ఆ ముగ్గురి వైపు నుంచి చూపించలేని గ్లామర్ ను కొసరు వేయడానికి ఓ ఐటమ్ గాళ్ కావలసి వచ్చేది. ఎందుకంటే సినిమాకి కథాకథనాలు ఎంత అవసరమో, గ్లామర్ కూడా అంతే అవసరమని భావించేవారు. వాళ్ల అభిప్రాయం సరైనదేనని మాస్ ఆడియన్స్ నిరూపించేవారు. అయితే ఆ మధ్య కాలంలో ఓ అందాల హీరోయిన్ తెరపై తెల్ల కలువలా విరిసింది. విశాలమైన కళ్లతో .. విరుగుడు లేని చూపులతో కుర్రకారు ప్రేక్షకులకు కునుకు లేకుండా చేసింది. చక్కని కనుముక్కుతీరుతో వెండితెరకు వెలుగు తీసుకొచ్చిన బ్యూటీగా ఆమెను గురించి చెప్పుకున్నారు. ఆ సుందరి పేరే అనూ ఇమ్మాన్యుయేల్. అనూ లోని ప్రత్యేకమైన ఆకర్షణ ఆమెకి వరుస అవకాశాలు దక్కేలా చేశాయి. దాంతో ఈ బ్యూటీ ఒక రేంజ్ లో దూసుకెళ్లడం ఖాయమని అంతా అనుకున్నారు. నాని 'మజ్ను'తో ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి, 'అజ్ఞాతవాసి' .. 'నా పేరు సూర్య' సినిమాలతో టాప్ హీరోయిన్ కేటగిరీలోకి వెళ్లిపోతుందని అభిమానులు అనుకున్నారు. కానీ ఆ సినిమాలు మాత్రమే కాదు, ఆ తరువాత చేసినవి కూడా సరిగ్గా ఆడలేదు. ఇప్పుడు కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ఈ కోల కళ్ల భామ పేరు ఎక్కడా వినిపించడం లేదు. అదృష్టం ఎదురుపడితే అమ్మడు తప్పుకుపోయిందా? లేదంటే అదృష్టమే తప్పించుకుని పోయిందా? అనేదే అభిమానులకు అర్థం కానీ ప్రశ్నగా మిగిలిపోయింది.