Sacramento: హైవేపై కుప్పకూలిన హెలికాప్టర్.. పలువురికి గాయాలు.. వీడియో ఇదిగో!

Sacramento Helicopter Crash on Highway 50 Injures Several
  • అమెరికాలోని శాక్రమెంటోలో హైవేపై కూలిన మెడికల్ హెలికాప్టర్
  • హైవే 50పై ఓ కారు మీద తలకిందులుగా పడ్డ వైనం
  • ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు
  • ఘటనతో హైవేపై పూర్తిగా నిలిచిపోయిన రాకపోకలు
  • ప్రమాద కారణాలపై అధికారుల దర్యాప్తు ప్రారంభం
అమెరికాలో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోగులను అత్యవసరంగా ఆసుపత్రులకు తరలించే ఓ మెడికల్ హెలికాప్టర్ (ఎయిర్ అంబులెన్స్) రద్దీగా ఉండే హైవేపై కుప్పకూలింది. ఈస్ట్ శాక్రమెంటోలోని హైవే 50పై ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్ నేరుగా ఓ వాహనంపై తలకిందులుగా పడిపోవడంతో, ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు శాక్రమెంటో అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.

‘రీచ్ ఎయిర్ మెడికల్ సర్వీసెస్’కు చెందిన ఎయిర్‌బస్ హెచ్-130 హెలికాప్టర్ యూసీ డేవిస్ మెడికల్ సెంటర్ పైనుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమాచారం అందిన వెంటనే అత్యవసర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంతో హైవే 50పై తూర్పు వైపు వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేసి, ట్రాఫిక్‌ను మళ్లించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన చిత్రాల్లో ఎరుపు రంగు హెలికాప్టర్ హైవే మధ్యలో కారుపై తలకిందులుగా పడి ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్ ఆసుపత్రికి వెళుతోందా? లేక రోగిని తీసుకుని వస్తోందా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, అధికారులు దర్యాప్తు ప్రారంభించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 
Sacramento
Helicopter crash
California
Highway 50
Air ambulance
REACH Air Medical Services
UC Davis Medical Center
East Sacramento
Accident

More Telugu News