Sajjanar: డ్రైవింగ్‌లో ఫోన్ వాడుతున్నారా?... సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్!

Sajjanar Serious Warning Against Phone Use While Driving
  • డ్రైవింగ్‌లో ఫోన్ వాడే వారిపై కఠిన చర్యలు తప్పవన్న సీపీ స‌జ్జ‌నార్‌
  • వీడియోలు చూడటం, ఇయర్‌ఫోన్స్ వాడటం శిక్షార్హమన్న సీపీ
  • ముఖ్యంగా ఆటో, క్యాబ్, బైక్ టాక్సీ డ్రైవర్లే లక్ష్యం
  • డ్రైవర్ల పరధ్యానం ప్రాణాలకే ముప్పని స్పష్టీకరణ
  • రోడ్డు భద్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని సూచన
వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్‌లో వీడియోలు చూడటం, చెవిలో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని కబుర్లలో మునిగిపోవడం వంటి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు ఇకపై చెక్ పెట్టాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఇలాంటి ప్రమాదకరమైన చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీవ్రంగా హెచ్చరించారు. డ్రైవింగ్‌లో మొబైల్ ఫోన్ వాడటం కేవలం ప్రమాదకరమే కాదని, చట్టప్రకారం శిక్షార్హమైన నేరమని ఆయన స్పష్టం చేశారు.

ప్రధానంగా ఆటో రిక్షా, క్యాబ్, బైక్ ట్యాక్సీ డ్రైవర్లలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. డ్రైవింగ్ సమయంలో ఫోన్ వాడటం వల్ల వారి ఏకాగ్రత పూర్తిగా దెబ్బతింటుందని, రోడ్డుపై దృష్టి నిలపలేరని తెలిపారు. ఇది డ్రైవర్లకే కాకుండా వాహనంలోని ప్రయాణికులకు, రోడ్డుపై వెళ్లే పాదచారులకు కూడా ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇలాంటి నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్‌ను ఉపేక్షించేది లేదని, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని సజ్జనార్ స్పష్టం చేశారు. డ్రైవర్, ప్రయాణికులతో పాటు రోడ్డుపై వెళ్లే ప్రతి ఒక్కరి భద్రతే తమకు అత్యంత ముఖ్యమని తెలిపారు. క్షణం పాటు పరధ్యానం ప్రాణాలకే ముప్పు తెస్తుందని గుర్తుంచుకోవాలని ఆయన 'ఎక్స్' (ట్విట్టర్‌) వేదికగా సూచించారు. చిన్న చిన్న అవసరాల కోసం విలువైన ప్రాణాలను పణంగా పెట్టవద్దని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Sajjanar
Sajjanar IPS
Hyderabad police
Traffic rules
Road safety
Phone driving
Mobile phone driving
Driving safety
Hyderabad traffic police
Drink and drive

More Telugu News