ఫార్మా హబ్‌గా హైదరాబాద్.. రూ.9 వేల కోట్ల పెట్టుబడిని ప్రకటించిన దిగ్గజ సంస్థ

  • తెలంగాణకు తరలివచ్చిన మరో భారీ పెట్టుబడి
  • రూ.9,000 కోట్లతో ముందుకొచ్చిన ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ
  • హైదరాబాద్‌లో దేశంలోనే తొలి మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు
  • పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందన్న సీఎం రేవంత్
  • స్థానికంగా పెరగనున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చి చేరింది. ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా సంస్థ 'ఎలీ లిల్లీ అండ్ కంపెనీ' సుమారు రూ.9,000 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఇండియాలోనే తమ మొట్టమొదటి మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌ను ఇక్కడ ఏర్పాటు చేయనుంది.

సోమవారం హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎలీ లిల్లీ ప్రతినిధి బృందం సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైంది. ఈ సందర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని, ఎలీ లిల్లీ వంటి దిగ్గజ సంస్థ ముందుకు రావడం సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్రంపై నమ్మకం ఉంచినందుకు కంపెనీకి ధన్యవాదాలు తెలిపిన ఆయన, కొత్త పరిశ్రమలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న ఈ మాన్యుఫ్యాక్చరింగ్ క్వాలిటీ హబ్ తమకు అత్యంత కీలకమని ఎలీ లిల్లీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్ తెలిపారు. "ప్రపంచవ్యాప్తంగా ఔషధాల తయారీ, సరఫరా సామర్థ్యాన్ని పెంచేందుకు భారీగా పెట్టుబడులు పెడుతున్నాం. హైదరాబాద్ హబ్ నుంచి దేశంలోని మా కాంట్రాక్ట్ తయారీ నెట్‌వర్క్‌ను పర్యవేక్షిస్తాం" అని ఆయన వివరించారు. ఈ కొత్త కేంద్రం ద్వారా తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఫార్మా రంగ నిపుణులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని, త్వరలోనే ఇంజినీర్లు, సైంటిస్టులు, ఇతర నిపుణుల నియామకాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఎలీ లిల్లీ విస్తరణ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి నిదర్శనమని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ ముందుండటం వల్లే ఇలాంటి ప్రపంచస్థాయి సంస్థలు ఆకర్షితులవుతున్నాయని తెలిపారు. హైదరాబాద్ ఫార్మా రంగానికి మొదటి నుంచి కేంద్రంగా ఉందని, దేశంలోని బల్క్ డ్రగ్స్‌లో 40 శాతం ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఎలీ లిల్లీ సంస్థకు ఇప్పటికే గురుగ్రామ్, బెంగళూరు నగరాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులోనే హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను కూడా ప్రారంభించింది. ఆ సమయంలో మంత్రి శ్రీధర్ బాబు జరిపిన చర్చలు, తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశం ఫలించడంతో ఈ భారీ పెట్టుబడికి మార్గం సుగమమైంది.


More Telugu News