దేశీయ 5జీ నెట్ వర్క్ పరీక్షించేందుకు మద్రాస్ ఐఐటీకి అనుమతి

  • అధికారికంగా సర్టిఫికేట్ జారీ చేసిన ఎన్‌సీసీఎస్
  • దేశీయ సాంకేతికతకు ప్రోత్సాహమన్న ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ కామకోటి
  • దేశ సైబర్ భద్రతకు ఇది గణనీయంగా ఉపయోగపడుతుందన్న ఐఐటీ ప్రవర్తక్ సీఈవో శంకర్ రామన్
దేశీయ 5జీ నెట్‌వర్క్‌ను పరీక్షించేందుకు మద్రాస్ ఐఐటీకి అనుమతి లభించింది. ఐఐటీ మద్రాస్‌కు చెందిన ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన టెలికాం సెక్యూరిటీ టెస్టింగ్ ల్యాబ్‌కు కేంద్ర టెలికాం శాఖ కీలక గుర్తింపు ఇచ్చింది. 5జీ నెట్‌వర్క్ సెక్యూరిటీ టెస్టింగ్‌కు అవసరమైన అధికారిక అనుమతి దీనికి లభించింది.

ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ కమ్యూనికేషన్ సెక్యూరిటీ (ఎన్‌సీసీఎస్) అధికారికంగా సర్టిఫికేట్ జారీ చేసింది. దేశంలోనే మొట్టమొదటి సర్టిఫైడ్ 5జీ సెక్యూరిటీ టెస్టింగ్ ల్యాబ్‌గా ప్రవర్తక్ గుర్తింపు పొందింది. ఈ ల్యాబ్ 5జీ కోర్ నెట్‌వర్క్ ఫంక్షన్, యాక్సెస్ అండ్ మొబిలిటీ మేనేజ్‌మెంట్ ఫంక్షన్ (ఏఎంఎఫ్), 5జీ గ్రూప్-1 డివైజ్‌లను పరీక్షించగల సామర్థ్యం కలిగినదిగా ప్రకటించబడింది.

దేశీయ సాంకేతికతకు ప్రోత్సాహం

ఈ అభివృద్ధి పట్ల స్పందించిన ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి. కామకోటి మాట్లాడుతూ.. “ఇది దేశీయంగా సురక్షిత 5జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వేగంగా అమలు కావడానికి దోహదపడుతుంది. విదేశీ ల్యాబ్‌లపై ఆధారపడే అవసరం ఇక తగ్గుతుంది,” అన్నారు.

ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి తోడ్పాటు

ఈ సందర్భంగా ఐఐటీ ప్రవర్తక్ సీఈవో డా. శంకర్ రామన్ మాట్లాడుతూ, “ఈ గుర్తింపు మనదేశ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యసాధనలో ఒక పెద్ద ముందడుగు. దేశ సైబర్ భద్రతకు ఇది గణనీయంగా ఉపయోగపడుతుంది” అని పేర్కొన్నారు. 


More Telugu News