హైదరాబాదులో ఓ రెస్టారెంట్‌‎లో షాకింగ్ ఘటన.. రాగి సంగటిలో బొద్దింక ప్రత్యక్షం!

  • హైదరాబాద్ నానక్‌రామ్‌గూడ కృతుంగ రెస్టారెంట్‌లో ఘటన
  • కస్టమర్ ఆర్డర్ చేసిన రాగి సంగటిలో బొద్దింక ప్రత్యక్షం
  • ప్రశ్నించిన వినియోగదారుడితో సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం
  • అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోలు, వీడియోలు
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ రెస్టారెంట్లలో ఆహార భద్రతా ప్రమాణాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. రుచికరమైన వంటకాలకు పేరుగాంచిన కృతుంగ రెస్టారెంట్‌లో ఓ వినియోగదారుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. నానక్‌రామ్‌గూడ బ్రాంచ్‌లో ఓ వ్యక్తి ఆర్డర్ చేసిన రాగి సంగటిలో బొద్దింక కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటనతో హైదరాబాద్‌లోని ఆహార ప్రియులు మరోసారి ఉలిక్కిపడ్డారు.

వివరాల్లోకి వెళితే, సోమవారం ఓ వినియోగదారుడు నానక్‌రామ్‌గూడలోని కృతుంగ రెస్టారెంట్‌కు భోజనానికి వెళ్లాడు. అక్కడ రాగి సంగటి ఆర్డర్ చేశారు. సగం తిన్న తర్వాత అందులో బొద్దింక ఉండటాన్ని గమనించి షాక్‌కు గురయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని రెస్టారెంట్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా, వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాధితుడు ఆరోపించాడు. దీంతో అతడు యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆహార భద్రతా అధికారులకు ఫిర్యాదు చేశాడు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు.

రాగి సంగటిలో బొద్దింక ఉన్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వేగంగా వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కృతుంగ వంటి పేరున్న రెస్టారెంట్‌లో ఇలాంటి ఘటన జరగడంపై ఆ రెస్టారెంట్ రెగ్యులర్ కస్టమర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని హోటళ్లలో పరిశుభ్రతపై అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. 


More Telugu News