బీహార్‌లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం: 11 మంది అభ్యర్థులను ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ

  • ఢిల్లీ, పంజాబ్ నమూనా పాలనను అందిస్తామని హామీ
  • బీహార్ అసెంబ్లీలో ఎవరితోనూ పొత్తు ఉండదని స్పష్టీకరణ
  • సంస్కరణల గురించి ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు మాట్లాడుతున్నారని వ్యాఖ్య
  • మేం ఎప్పుడో ప్రారంభించామన్న ఆమ్ ఆద్మీ పార్టీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేయనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు 11 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ అజేష్ యాదవ్ మాట్లాడుతూ, ఢిల్లీ, పంజాబ్ తరహా పాలనాను అందిస్తామని హామీ ఇచ్చారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం పాలన నమూనా, అభివృద్ధి ప్రజల ముందు ఉన్నాయని ఆయన అన్నారు.

ఢిల్లీ, పంజాబ్‌లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని తెలిపారు. ఢిల్లీలో తమ విజయానికి పూర్వాంచల్ ప్రాంతానికి చెందిన ప్రజలు ఎంతో దోహదపడ్డారని వ్యాఖ్యానించారు. 

బెగుసరాయ్‌లో మీరా సింగ్, పూర్నియా జిల్లాలోని కస్బా స్థానంలో భాను భారతీయ, పాట్నాలోని ఫుల్వారీ స్థానంలో అరుణ్ కుమార్ రజక్, పాట్నాలోని బంకిపూర్‌లో పంకజ్ కుమార్, మోతీహరిలోని గోవింద్‌గంజ్‌లో అశోక్ కుమార్ సింగ్, బక్సర్ స్థానంలో రిటైర్డ్ కెప్టెన్ ధర్మరాజ్ సింగ్‌లను పార్టీ ప్రకటించింది.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోదని రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ సహ ఇన్‌ఛార్జ్ అభినవ్ రాయ్ తెలిపారు. ప్రజలతోనే తమ కూటమి ఉంటుందని, ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు సంస్కరణల గురించి మాట్లాడుతున్నారని, కానీ తాము ఢిల్లీ, పంజాబ్‌లలో ఎప్పుడో ప్రారంభించామని అన్నారు. స్టార్ క్యాంపెయినర్ల జాబితాను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.


More Telugu News