పోలవరం నిర్వాసితులకు పునరావాసంపై మంత్రి నిమ్మల కీలక ప్రకటన

  • ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రితో ఏపీ మంత్రి నిమ్మల భేటీ
  • 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని వెల్లడి
  • 2027 మార్చి కల్లా నిర్వాసితుల పునరావాసం పూర్తి చేస్తామని హామీ
ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసి, ప్రధానమంత్రి చేతుల మీదుగా జాతికి అంకితం చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. తాజాగా ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అయిన అనంతరం ఆయన ఈ విషయాలు వెల్లడించారు.

కేంద్ర మంత్రి పాటిల్‌తో జరిగిన సమావేశంలో పోలవరం పనుల పురోగతి, పెండింగ్‌లో ఉన్న డిజైన్ల అనుమతులపై చర్చించినట్లు మంత్రి నిమ్మల తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో పనులు జరుగుతున్న తీరు పట్ల కేంద్ర మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారని, ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చే ప్రతి పైసాను సద్వినియోగం చేస్తున్నామని వివరించినట్లు చెప్పారు. ప్రాజెక్టు పనులను స్వయంగా పర్యవేక్షించేందుకు రావాలని కోరగా, బీహార్ ఎన్నికల తర్వాత వస్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన నిర్వాసితుల పునరావాసంపై కూడా ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ఉందని మంత్రి నిమ్మల వివరించారు. 2026 మే నెలాఖరు నాటికి రూ.900 కోట్ల వ్యయంతో 28,946 మందికి పునరావాసం కల్పిస్తామని, 2027 మార్చి నాటికి పునరావాస ప్రక్రియను పూర్తిగా ముగిస్తామని హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టు అనిశ్చితిలో పడిందని నిమ్మల రామానాయుడు విమర్శించారు. "రివర్స్ టెండరింగ్ పేరుతో కాలయాపన చేయడం, కేంద్రం హెచ్చరికలను పెడచెవిన పెట్టడం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది. దీనివల్ల ఇప్పుడు కొత్తగా రూ.900 కోట్లతో డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది" అని ఆయన ఆరోపించారు. 

గత ఐదేళ్లలో 17 నెలల పాటు పనులు పూర్తిగా నిలిచిపోయాయని, చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనుల్లో వేగం పెరిగిందని పేర్కొన్నారు. పోలవరం పూర్తయితే 7.2 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందడంతో పాటు, 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని మంత్రి గుర్తుచేశారు 


More Telugu News