ఏపీలో మరిన్ని పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించండి: టాటా గ్రూప్ ఛైర్మన్ తో మంత్రి లోకేశ్

  • ముంబయిలో టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో మంత్రి నారా లోకేశ్ సమావేశం
  • ఐటీ, ఈవీ, ఏరోస్పేస్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానం
  • విశాఖ, శ్రీసిటీ, మచిలీపట్నంలలో యూనిట్ల ఏర్పాటుకు కీలక ప్రతిపాదనలు
  • అవసరమైన భూమి, ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రభుత్వ హామీ
  • విశాఖ టీసీఎస్ కేంద్రం ప్రారంభోత్సవానికి రావాలని చంద్రశేఖరన్‌కు విజ్ఞప్తి
  • విశాఖలో ఏఐ రెడీ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని కోరిన లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ నేడు ముంబయిలో టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరిస్తూ, పలు రంగాల్లో టాటా గ్రూప్ భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. ఏపీలో మరిన్ని పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించండి అని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో టాటా గ్రూప్‌కు చెందిన వివిధ కంపెనీల సీఈవోలు, ఎండీలు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా, ఈ నెలలో విశాఖపట్నంలో జరగనున్న టీసీఎస్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని చంద్రశేఖరన్‌ను మంత్రి లోకేశ్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం రాష్ట్రంలో టాటా గ్రూప్ చేపట్టగల ప్రాజెక్టులపై రంగాలవారీగా సమగ్ర ప్రతిపాదనలు ఆయన ముందుంచారు.

ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగాలపై ప్రధాన దృష్టి

విశాఖపట్నాన్ని తూర్పు తీరంలో కీలక కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా, అక్కడ టాటా ఎల్క్సీ రీజనల్ ఆఫీస్ లేదా ఇంజనీరింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని లోకేశ్ ప్రతిపాదించారు. అలాగే, సాఫ్ట్‌వేర్ డిఫైండ్ వెహికల్స్ (SDV), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ టెక్నాలజీ వంటి అధునాతన రంగాలలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. మరో కీలక ప్రతిపాదనగా, టాటా ఎలక్ట్రానిక్స్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో OSAT (అవుట్‌సోర్స్‌డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్) యూనిట్‌ను స్థాపించే అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు అవసరమైన భూమిని ప్రభుత్వమే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ కింద కేటాయిస్తుందని హామీ ఇచ్చారు.

ఆటోమోటివ్, ఏరోస్పేస్ రంగాలకు ఆహ్వానం

ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) హబ్‌గా ఏపీని తీర్చిదిద్దే లక్ష్యంతో శ్రీసిటీలో టాటా ఆటోకాంప్ ద్వారా ఈవీ విడిభాగాలు, అధునాతన కంపోజిట్ తయారీ యూనిట్లను స్థాపించాలని లోకేశ్ కోరారు. పెట్టుబడి పరిమాణాన్ని బట్టి ప్రత్యేక ప్రోత్సాహకాలు, ప్లగ్ అండ్ ప్లే మౌలిక వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఒక ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేయాలని, రక్షణ రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఆహ్వానించారు.

ఇంధనం, మౌలిక వసతుల రంగాల్లో అవకాశాలు

పునరుత్పాదక ఇంధన రంగంలో టాటా పవర్ రెన్యూవబుల్స్ భాగస్వామ్యాన్ని లోకేశ్ ఆకాంక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంతో పాటు, రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టులను చేపట్టాలని కోరారు. సెల్, మాడ్యూల్ తయారీ యూనిట్ స్థాపనకు ఉన్న అవకాశాలను కూడా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. మచిలీపట్నం లేదా మూలపేట పోర్టులకు సమీపంలో ఉన్న ఉప్పు భూముల్లో టాటా కెమికల్స్ ఆధ్వర్యంలో సోడా యాష్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతోపాటు, విశాఖలోని డేటా సిటీ ప్రాంతంలో ఎస్టీ టెలీమీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ ద్వారా ఒక ఏఐ రెడీ డేటా సెంటర్ క్యాంపస్ స్థాపించాలని కోరారు. ఈ ప్రతిపాదనల పట్ల టాటా గ్రూప్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.


More Telugu News