BC Reservations: బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంలో ఊరట.. పిటిషన్ కొట్టివేత

Revanth Reddy Government Gets Relief in Supreme Court on BC Reservations Petition Dismissed
  • రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం
  • హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ
  • స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన రేవంత్ సర్కార్
  • మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటాయంటూ పిటిషనర్ వాదన
  • తెలంగాణలో అక్టోబర్ 9 నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో విచారణ జరుగుతున్నందున తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

జస్టిస్ విక్రమ్‌నాథ్‌, జస్టిస్ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. హైకోర్టులో కేసు విచారణలో ఉండగా ఇక్కడికి ఎందుకు వచ్చారని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. దీనికి న్యాయవాది బదులిస్తూ, హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించిందని తెలిపారు. "అక్కడ స్టే ఇవ్వడానికి నిరాకరిస్తే ఇక్కడికి వస్తారా?" అని వ్యాఖ్యానించిన ధర్మాసనం, హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని చెబుతూ పిటిషన్‌ను తిరస్కరించింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు మొత్తం 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం జీఓ జారీ చేసిందని వంగా గోపాల్ రెడ్డి అనే వ్యక్తి తన పిటిషన్‌లో ఆరోపించారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో మొత్తం కోటా 67 శాతానికి చేరిందని, ఇది చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. జీఓ నంబర్ 9ను తక్షణమే రద్దు చేయాలని ఆయన కోరారు. ఈ పిటిషన్‌లో మాధవరెడ్డి అనే వ్యక్తి, తీన్మార్ మల్లన్న కూడా ఇంప్లీడ్ అయ్యారు.

కాగా, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 26న జీఓ నంబర్ 9ను జారీ చేసి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఈ జీఓ ఆధారంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 9 నుంచి నవంబర్ 11 వరకు ఐదు దశల్లో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇదే జీఓను సవాల్ చేస్తూ దాఖలైన మరో పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ఈ నెల‌ 8కి వాయిదా పడిన విషయం తెలిసిందే. 
BC Reservations
Revanth Reddy
Telangana
Supreme Court
Local Body Elections
G.O. 9
High Court
Vanga Gopal Reddy
Election Schedule
SC ST Reservations

More Telugu News