విమానంలో సచిన్‌తో తమన్.. క్రికెట్ దేవుడి నుంచి ఊహించని ప్రశంసలతో ఉబ్బితబ్బిబ్బు!

  • క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను కలిసిన సంగీత దర్శకుడు తమన్
  • విమాన ప్రయాణంలో తన బ్యాటింగ్ వీడియోలను సచిన్‌కు చూపించిన వైనం
  • తమన్ బ్యాట్ స్పీడ్‌ను మెచ్చుకున్న మాస్టర్ బ్లాస్టర్
  • త్వరలో సచిన్‌తో కలిసి పనిచేసే అవకాశం ఉందంటూ తమన్ హింట్
  • ‘ఓజీ’ సక్సెస్‌తో పాటు వరుస సినిమాలతో బిజీగా ఉన్న తమన్
ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దీనికి కారణం క్రికెట్ దేవుడిగా అభిమానులు పిలుచుకునే దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ స్వయంగా ఆయన బ్యాటింగ్‌ను ప్రశంసించడమే. డాలస్ నుంచి దుబాయ్ వెళ్లే విమానంలో సచిన్‌తో కలిసి ప్రయాణించే అరుదైన అవకాశం తమన్‌కు లభించింది. ఈ సందర్భంగా జరిగిన ఓ ఆసక్తికర సంభాషణను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

సోమవారం తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో సచిన్‌తో దిగిన ఫొటోను పోస్ట్ చేసిన తమన్, తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. "క్రికెట్ దేవుడు, లెజెండ్ సచిన్ టెండూల్కర్‌తో కలిసి ప్రయాణిస్తున్నాను. డాలస్ నుంచి దుబాయ్ వరకు ప్రయాణంలో మంచి సమయం గడిపాను. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) మ్యాచ్‌లలో నా బ్యాటింగ్ క్లిప్స్‌ను ఆయనకు చూపించాను. అది చూసిన మాస్టర్.. ‘మీకు అద్భుతమైన బ్యాట్ స్పీడ్ ఉంది’ అని అన్నారు. ఇక నా ఆనందం మాటల్లో చెప్పలేనిది. బహుశా త్వరలో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావచ్చు" అని తమన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

తమన్‌కు సంగీతంతో పాటు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఆయన సీసీఎల్‌లో తెలుగు వారియర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ, తన ధాటియైన బ్యాటింగ్‌తో చాలాసార్లు జట్టును గెలిపించారు. తరచుగా తన స్టూడియో సిబ్బందితో కలిసి క్రికెట్ ఆడతారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.

ఇక సినిమాల విషయానికొస్తే, పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘ఓజీ’ చిత్రానికి తమన్ అందించిన సంగీతం సినిమా విజ‌యానికి కార‌ణ‌మైంది. ఈ సినిమా విజయోత్సాహంలో ఉన్న ఆయన చేతిలో ప్రస్తుతం ‘అఖండ 2: తాండవం’, ప్రభాస్ ‘ది రాజా సాబ్’ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ‘ఓజీ’ విజయంలో తమన్ సంగీతం కీలక పాత్ర పోషించిందని, సినిమాకు ఆయన ఒక స్తంభంలా నిలిచారని దర్శకుడు సుజీత్ స్వ‌యంగా ప్రశంసించారు.

 ఇదిలా ఉండగా, శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘బాయ్స్’ సినిమాతో నటుడిగా పరిచయమైన తమన్, చాలా కాలం తర్వాత మళ్లీ నటనలోకి అడుగుపెడుతున్నారు. అథర్వ హీరోగా ఆకాశ్ భాస్కరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇదయం మురళి’ అనే తమిళ చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.




More Telugu News