ముంబైలో మంత్రి లోకేశ్‌ పర్యటన.. పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు

  • నేడు ముంబైలో పర్యటించనున్న మంత్రి నారా లోకేశ్‌
  • పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగ కల్పనే ప్రధాన లక్ష్యం
  • టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో పాటు పలువురు దిగ్గజాలతో సమావేశం
  • సాయంత్రం జరగనున్న 30వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొననున్న మంత్రి
  • విశాఖలో జరిగే సమ్మిట్‌కు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్న లోకేశ్‌
ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించి, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ రోజు ముంబైలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకురావడమే ఏకైక అజెండాగా ఆయన పర్యటన కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా దేశంలోని పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో ఆయన సమావేశం కానున్నారు.

ఈ పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్‌ టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. వీరితో పాటు ట్రాఫిగురా సీఈఓ సచిన్ గుప్తా, ఈఎస్ఆర్ గ్రూప్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ హెడ్ సాదత్ షా, హెచ్‌పీ ఐఎన్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇప్సితా దాస్ గుప్తా, బ్లూ స్టార్ లిమిటెడ్ డిప్యూటీ ఛైర్మన్ వీర్ అద్వానీ వంటి ప్రముఖులతో లోకేశ్‌ చర్చలు జరపనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, ప్రభుత్వ విధానాలను ఆయన వారికి వివరించనున్నారు.

అలాగే, ఈరోజు సాయంత్రం ముంబైలో జరగనున్న 30వ సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) పార్టనర్‌షిప్ సమ్మిట్ రోడ్ షోలో కూడా మంత్రి లోకేశ్‌ పాల్గొంటారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలను మరింత మందికి చేరువ చేయనున్నారు.

వచ్చే నవంబర్ నెలలో విశాఖపట్నం వేదికగా జరగనున్న ప్రతిష్ఠాత్మక పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా మంత్రి లోకేశ్ ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలను స్వయంగా ఆహ్వానించనున్నారు. ఏపీని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ పర్యటన ఎంతో కీలకమైనదిగా భావిస్తున్నారు.


More Telugu News