జగన్ అధికారంలో ఉంటే మన 'ఫీవర్ స్టార్' ఇలా అనేవారు: యాంకర్ శ్యామల

  • పవన్ కల్యాణ్‌, టీడీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన యాంకర్ శ్యామల
  • కల్తీ మద్యం, యూరియా కొరత అంశాలపై ఘాటు వ్యాఖ్యలు
  • జగన్ అధికారంలో ఉంటే పవన్ ఊగిపోయేవారంటూ ఎద్దేవా
  • టీడీపీ కల్తీ మద్యం ఫ్యాక్టరీలంటూ వచ్చిన పత్రికా కథనం ప్రస్తావన
  • సోషల్ మీడియా వేదికగా విమర్శనాస్త్రాలు సంధించిన వైసీపీ అధికార ప్రతినిధి
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తీవ్రస్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కల్తీ మద్యం తయారీ అంశాన్ని యూరియా కొరతతో ముడిపెడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. టీడీపీ నేతల ఆధ్వర్యంలో కల్తీ మద్యం ఫ్యాక్టరీలు నడుస్తున్నాయంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌ తీరును ఆమె తప్పుబట్టారు. "కావాల్సినంత కల్తీ మద్యం తయారు చేసినట్టే, కావాల్సినంత యూరియాని తయారు చేయాల్సింది కదా?" అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదే సమయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి ఉంటే పవన్ కళ్యాణ్ స్పందన మరోలా ఉండేదని ఆమె ఎద్దేవా చేశారు.

"ఈ సమయంలో జగన్ గారు అధికారంలో ఉంటే... ఈపాటికి మన "ఫీవర్ స్టార్" PPP గారు ఇలా అనేవారు... 'కల్తీ మద్యాన్ని తయారుచేసి మద్యపాన ప్రియుల పొట్ట కొట్టారు... సకాలంలో యూరియా అందించలేక రైతుల పొట్ట కొట్టారు. ఊ..హ...' అని తెగ ఊగిపోయేవారు... మరి ఇప్పుడు???"  అంటూ శ్యామల ప్రశ్నించారు.


More Telugu News