కూతురి భర్తను పెళ్లాడబోయిన తల్లి.. అడ్డుపడిందని చంపాలని యత్నం

  • తిరుపతి జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే ఘటన
  • అల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న అత్త
  • కూతురు చూస్తుండగానే అల్లుడితో పెళ్లికి యత్నం
  • అడ్డుకున్న కన్నకూతురిపై రోకలి బండతో దాడి
  • తల్లీఅల్లుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత
సభ్యసమాజం తలదించుకునే ఘటన తిరుపతి జిల్లాలో వెలుగుచూసింది. కన్న కూతురి కాపురంలోనే చిచ్చుపెట్టిన ఓ తల్లి, ఏకంగా ఆమె భర్తనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడింది. ఈ దారుణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన కూతురిపైనే హత్యాయత్నం చేసింది. 

స్థానికుల కథనం ప్రకారం కేవీబీపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక, 18 ఏళ్ల యువకుడు ఐదు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. భర్త చనిపోవడంతో బాలిక తల్లి (40) కూడా వారితోనే కలిసి ఉంటోంది. ఈ క్రమంలో ఆమె తన అల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ బంధం ముదిరి ఏకంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

శుక్రవారం రాత్రి కూతురు చూస్తుండగానే ఆమె భర్త చేత తాళి కట్టించుకోవడానికి తల్లి ప్రయత్నించింది. తన భర్త తల్లి మెడలో తాళి కడుతుండటాన్ని చూసి ఆ బాలిక అడ్డుకుంది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన తల్లి, అల్లుడు కలిసి ఆమెపై దాడికి తెగబడ్డారు. రోకలి బండ తీసుకుని బాలిక తలపై బలంగా కొట్టారు.

బాధితురాలి ఆర్తనాదాలు విన్న చుట్టుపక్కల వారు వెంటనే అక్కడికి చేరుకుని బాలికను కాపాడారు. జరిగిన దారుణం తెలుసుకుని తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు.. ఆ తల్లి, అల్లుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. 


More Telugu News