తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టులో పిటిషన్

  • హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన వంగ గోపాల్ రెడ్డి
  • ఈ నెల 6న విచారించనున్న జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం
  • ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు మోగిన నగారా
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 6న ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది. 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమంటూ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

మరోవైపు, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మాధవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఈ నెల 8న తిరిగి విచారణ జరపనుంది. ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రిజర్వేషన్ల అంశం హైకోర్టు, సుప్రీంకోర్టుకు చేరడం గమనార్హం.

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మిగతా మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది.


More Telugu News