ఆసియా కప్‌తో పరారైన మోసిన్ నఖ్వీకి పాకిస్థాన్‌లో గోల్డ్ మెడల్!

  • ఆసియా కప్ ఫైనల్‌లో భారత్‌తో వివాదంపై పీసీబీ చీఫ్‌కు పురస్కారం
  •  మొహ్సిన్ నఖ్వీకి షహీద్ జుల్ఫికర్ అలీ భుట్టో ఎక్సలెన్స్ గోల్డ్ మెడల్
  • టీమిండియాకు ట్రోఫీని తిరస్కరించడంతో దేశ గౌరవాన్ని కాపాడారని ప్రశంస
  • బీసీసీఐకి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని గతంలో స్పష్టం చేసిన నఖ్వీ
  • కరాచీలో ఘనంగా అవార్డు ప్రదానోత్సవానికి సన్నాహాలు
  • వివాదాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమైన బీసీసీఐ
ఇటీవలే ముగిసిన ఆసియా కప్ ఫైనల్‌లో ట్రోఫీ ప్రదానోత్సవం సందర్భంగా భారత క్రికెట్ జట్టుతో తలెత్తిన వివాదంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ మొహ్సిన్ నఖ్వీ ప్రదర్శించిన వైఖరికి గాను ఆయనకు ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించనుంది. పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా కూడా ఉన్న నఖ్వీకి ‘షహీద్ జుల్ఫికర్ అలీ భుట్టో ఎక్సలెన్స్ గోల్డ్ మెడల్’ అందజేయనున్నట్లు సింధ్, కరాచీ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ల అధ్యక్షుడు, అడ్వకేట్ గులాం అబ్బాస్ జమాల్ ప్రకటించారు.

ఆసియా కప్ ఫైనల్ అనంతరం ట్రోఫీని అందుకునేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించిన విషయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి భారత జట్టు ఇష్టపడకపోవడాన్ని రాజకీయపరమైన అవమానంగా పాకిస్థాన్ వర్గాలు భావించాయి. ఈ పరిణామంతో మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీని తన వద్దే ఉంచుకున్నారు. భారత జట్టుకు నిజంగా కావాలనుకుంటే ఏసీసీ ప్రధాన కార్యాలయానికి వచ్చి తీసుకోవచ్చని ఆయన సోషల్ మీడియా ద్వారా వ్యాఖ్యానించారు.

ఈ ఘటనపై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, తాను ఎలాంటి తప్పు చేయలేదని, బీసీసీఐకి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని నఖ్వీ గతంలోనే తేల్చిచెప్పారు. భారత్‌తో క్రీడా, రాజకీయ సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్న తరుణంలో నఖ్వీ తీసుకున్న ఈ ధైర్యమైన వైఖరి పాకిస్థాన్ జాతీయ గౌరవాన్ని నిలబెట్టిందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనను ఈ పురస్కారంతో సత్కరించాలని నిర్ణయించారు.

కరాచీలో ఈ అవార్డు ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీని ఆహ్వానించారు. ఆయన హాజరు ఖరారైన వెంటనే తేదీని ప్రకటిస్తామని తెలిపారు. "ఇది కేవలం క్రికెట్‌కు సంబంధించిన విషయం కాదు. దేశ గౌరవం, సార్వభౌమత్వానికి సంబంధించినది" అని గులాం అబ్బాస్ జమాల్ అన్నారు. కాగా, ఈ ట్రోఫీ వివాదాన్ని ఇప్పటికే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) దృష్టికి తీసుకెళ్లిన బీసీసీఐ, నవంబర్‌లో జరిగే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సమావేశంలోనూ ప్రస్తావించేందుకు సిద్ధమవుతోంది.


More Telugu News