భారత్‌లో ఉద్యోగంపై రష్యా యువతి పోస్ట్.. ఆఫీసుల్లో ఆ అలవాట్లు వింతగా అనిపించాయట!

  • బెంగళూరులో 12 ఏళ్లుగా పనిచేస్తున్న రష్యా మహిళ యులియా అస్లమోవా
  • భారత ఆఫీసుల పనితీరుపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్
  • సహోద్యోగులు భోజనం గురించి అడగడం ఆశ్చర్యపరిచిందని వెల్లడి
  • మేనేజర్ వెళ్లేదాకా సిబ్బంది ఆఫీసులోనే ఉండటంపై వ్యాఖ్య
  • ఆలస్యంగా ఫోన్ కాల్స్, అర్ధరాత్రి ఈమెయిల్స్ ఇక్కడ సాధారణమన్న యులియా
  • ఏళ్లపాటు కలిసి పనిచేయడంతో సహోద్యోగులు కుటుంబసభ్యుల్లా మారిపోయారని వెల్లడి
బెంగళూరులో గత 12 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్న రష్యాకు చెందిన ఓ మహిళ, భారతీయ కార్యాలయాల్లో తాను గమనించిన ఆసక్తికర విషయాలను పంచుకుంటూ పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. యులియా అస్లమోవా అనే ఈ కంటెంట్ క్రియేటర్, తన ఇన్‌స్టా బయోలో తనను తాను ‘భారత్ కోడలు’గా అభివర్ణించుకున్నారు.

భారతదేశంలో తన ఉద్యోగ ప్రస్థానం మొదలైన రోజులను ఆమె గుర్తుచేసుకున్నారు. "12 ఏళ్ల క్రితం ఇక్కడ ఉద్యోగంలో చేరినప్పుడు, నా సహోద్యోగులు టిఫిన్ చేశావా? కాఫీ తాగావా? భోజనం చేశావా? అని ఎంతో ఆప్యాయంగా అడిగేవారు. అది నాకు ఎంతో ప్రత్యేకంగా అనిపించింది" అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. 

ఆఫీసుల్లో పండగలు, పూజలు అందరూ కలిసి చేసుకోవడం కూడా తనను ఆకట్టుకుందని తెలిపారు. ఎక్కువ సమయం సహోద్యోగులతోనే గడుపుతాం కాబట్టి ఇలా కలిసి పండగలు జరుపుకోవడం ఎంతో బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.

అదే సమయంలో, భారతీయ ఆఫీసుల్లో తనకు వింతగా అనిపించిన మరికొన్ని అలవాట్లను కూడా ఆమె ప్రస్తావించారు. మేనేజర్ ఆఫీసు నుంచి వెళ్లే వరకు సిబ్బంది కూడా అక్కడే ఉండటం, రాత్రి 11 గంటలకు ఆఫీస్ కాల్స్ రావడం, అర్ధరాత్రి ఈమెయిల్స్ పంపడం ఇక్కడ చాలా సాధారణమని ఆమె వ్యాఖ్యానించారు. కొందరు ఉద్యోగులు ఆఫీసుకు చేరుకోవడానికే రెండు గంటల పాటు ప్రయాణించడం తనను ఆశ్చర్యపరిచిందని తెలిపారు. అలాగే, ఇక్కడి వారు ఏదైనా పనికి నేరుగా ‘కాదు’ అని చెప్పడానికి ఇష్టపడరని ఆమె గమనించారు.

యువతరం ఉద్యోగుల బాధ్యతాయుత ప్రవర్తన, ఆర్థిక క్రమశిక్షణ తనను ఎంతగానో స్ఫూర్తికి గురిచేశాయని యులియా తెలిపారు. "మొదటి జీతం నుంచే పొదుపు, పెట్టుబడులు పెట్టడం మొదలుపెడతారు. చిన్న వయసులోనే ఆర్థిక విషయాలపై ఇంత అవగాహనతో ఉండటం అద్భుతం" అని ఆమె ప్రశంసించారు.

చివరగా, ఇన్నేళ్ల ప్రయాణంలో తన సహోద్యోగులు కేవలం స్నేహితులుగానే కాకుండా ఒక కుటుంబంలా మారిపోయారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. "ఈ 12 ఏళ్ల ప్రయాణంలో నేను ఒక కొత్త కుటుంబాన్ని సంపాదించుకున్నాను. నా ఉద్యోగం వల్లే ఇదంతా సాధ్యమైంది" అని ఆమె తన పోస్టును ముగించారు.


More Telugu News