విజయ్ ప్రచార సభ తొక్కిసలాట ఘటన: సిట్ విచారణకు హైకోర్టు ఆదేశం

  • ఐపీఎస్ అధికారిణి ఆస్ట్రా గార్గ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు
  • వీడియోలు చూస్తుంటే హృదయం ద్రవిస్తోందన్న హైకోర్టు జడ్జి
  • ఈ కేసులో ఇద్దరిని మాత్రమే అరెస్టు చేయడంపై హైకోర్టు దిగ్భ్రాంతి
సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ ప్రచార సభ సందర్భంగా సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టు విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఐపీఎస్ అధికారిణి ఆస్రా గార్గ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు మద్రాస్ హైకోర్టు శుక్రవారం సిట్‌ను ఏర్పాటు చేసింది.

తొక్కిసలాటకు సంబంధించిన వీడియోలను చూస్తుంటే హృదయం ద్రవిస్తోందని జస్టిస్ ఎస్. సెంథిల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఇద్దరు వ్యక్తులను మాత్రమే అరెస్టు చేయడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజలను, పిల్లలను రక్షించడంలో విఫలమైనందుకు, ఈ సంఘటనకు బాధ్యత వహించనందుకు విజయ్ పార్టీని, ఆ పార్టీ నాయకులను, నిర్వాహకులను హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.

ఈ దుర్ఘటన పట్ల రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, అన్ని రాజకీయ పార్టీలు విచారం వ్యక్తం చేశాయని, అయితే నిర్వాహకులు మాత్రం ఈ సంఘటనకు బాధ్యత వహించకుండా దూరంగా ఉండటం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. తొక్కిసలాట కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను దర్యాప్తు ప్యానెల్‌కు అందజేయాలని జస్టిస్ సెంథిల్ కుమార్ కరూర్ పోలీసులను ఆదేశించారు.

41 మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విజయ్ పట్ల ఉదాసీనత ప్రదర్శిస్తోందని హైకోర్టు మండిపడింది. కరూర్‌లో జరిగిన దానిని ప్రపంచమంతా చూసిందని పేర్కొంది. పెద్ద సంఖ్యలో జనాలు వస్తారని తెలిసినప్పుడు అందుకు తగినట్లుగా ఏర్పాట్లు ఉండాలి కదా అని టీవీకే పార్టీని, పోలీసులను ప్రశ్నించింది.

మరోవైపు, టీవీకే నాయకులు బుస్సీ ఆనంద్, సీటీఆర్ నిర్మల్ కుమార్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఆదేశాలను హైకోర్టు రిజర్వ్ చేసింది.


More Telugu News