తోట చంద్రయ్య కుటుంబానికి న్యాయం జరగకుండా వైసీపీ అడ్డుకుంటోంది: గల్లా మాధవి

  • మంగళగిరిలో గల్లా మాధవి మీడియా సమావేశం
  • తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం రాకుండా వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపణ 
  • మండలిలో బొత్స బిల్లును వ్యతిరేకించారని ఆగ్రహం
  • బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే వైసీపీ కక్ష సాధిస్తోందని విమర్శ
  • ఈసారి ఒక్క సీటు కూడా రాదని వ్యాఖ్యలు 
టీడీపీ నేత తోట చంద్రయ్య కుటుంబానికి న్యాయం జరగకుండా వైసీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తీవ్రంగా ఆరోపించారు. చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టిన బిల్లును వైసీపీ అడ్డుకోవడమే ఇందుకు నిదర్శనమని ఆమె అన్నారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... బీసీల పట్ల వైసీపీ అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు.

గత ప్రభుత్వ హయాంలో టీడీపీ జెండా మోసినందుకే తోట చంద్రయ్యను వైసీపీ నాయకులు అత్యంత కిరాతకంగా నడిరోడ్డుపై బండరాళ్లతో కొట్టి చంపారని గల్లా మాధవి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దారుణ ఘటనను గుర్తు చేసుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు వస్తాయని అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయిస్తే, శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆ బిల్లును వ్యతిరేకించడం హేయమైన చర్య అని విమర్శించారు. చంద్రయ్య బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్లే వైసీపీ ఈ బిల్లును వ్యతిరేకించిందని, జగన్ రెడ్డి డైరెక్షన్‌లోనే బొత్స ఈ విధంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు.

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం కరోనాతో పాటు ‘జగన్-19’తో కూడా సతమతమైందని గల్లా మాధవి ఎద్దేవా చేశారు. ‘నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు’ అని గొప్పలు చెప్పుకునే జగన్ రెడ్డి, స్థానిక సంస్థల్లో ఎన్టీఆర్, చంద్రబాబు కల్పించిన 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి కుదించారని గుర్తు చేశారు. దీనివల్ల దాదాపు 16,800 మంది బడుగు బలహీన వర్గాల వారు రాజ్యాంగ పదవులకు దూరమయ్యారని అన్నారు. ఆ ఐదేళ్లలో 26 మంది బీసీలను హత్య చేశారని, 750 మందిపై తప్పుడు కేసులు బనాయించి, 2,500 మందిపై దాడులు చేశారని ఆమె ఆరోపించారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నక్సలైట్ల చేతిలో మరణించిన పిన్నెల్లి సుందరరామిరెడ్డి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేసుకోవాలని మాధవి సూచించారు. అదేవిధంగా తోట చంద్రయ్య కుటుంబానికి న్యాయం చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. బీసీల ప్రగతిని అడ్డుకుంటున్న వైసీపీకి భవిష్యత్తులో బీసీలే రాజకీయ సమాధి కడతారని, రానున్న రోజుల్లో 11 సీట్లు కాదు కదా ఒక్క సీటు కూడా గెలిచే అర్హత ఆ పార్టీకి లేదని ఆమె హెచ్చరించారు. ఇటీవల వడ్డెర, రజక సోదరులపై జరిగిన దాడులు కూడా వైసీపీ నాయకుల పెత్తందారీ పోకడలకు నిదర్శనమని గల్లా మాధవి విమర్శించారు.


More Telugu News