రష్యాపై దాడుల ప్రభావం.. భారత్ నుంచి వివిధ దేశాలకు పెరిగిన ఇంధన ఎగుమతులు

  • రష్యా రిఫైనరీలపై దాడులు... ప్రపంచ ఇంధన మార్కెట్లో ఇబ్బందులు
  • కొరతను భర్తీ చేస్తున్న భారత్
  • బ్రెజిల్, టర్కీ, యూఏఈలకు ఇంధనం సరఫరా చేస్తున్న రిలయన్స్, నయారా
ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారత్ తన ఇంధన ఉత్పత్తుల ఎగుమతులను వేగవంతం చేసింది. రష్యా రిఫైనరీలపై దాడులు తీవ్రం కావడంతో ప్రపంచ ఇంధన మార్కెట్‌లో కొరత ఏర్పడింది. ఈ కొరతను భర్తీ చేయడానికి భారత్ ఎగుమతులను ముమ్మరం చేసింది. ప్రైవేటు రంగంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ సంస్థలు బ్రెజిల్, టర్కీ, యూఏఈ, ఇంకా పలు ఆఫ్రికా దేశాలకు భారీగా ఎగుమతులు చేస్తున్నాయి.

ఇంతకాలం ఆయా దేశాలు రష్యాలో శుద్ధి చేసిన ఇంధనంపై ఆధారపడ్డాయని చెబుతున్నారు. అయితే, చమురు శుద్ధి సామర్థ్యం దెబ్బతినడంతో రష్యా దేశీయ అవసరాలపైనే ఎక్కువగా దృష్టి సారించింది. రానున్న శీతాకాలంలో రష్యాలో చమురు అవసరాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంగానే సెప్టెంబర్ నెలలో రోజుకు రెండు లక్షల బ్యారెళ్ల ఇంధన ఎగుమతులను రష్యా తగ్గించిందని కెప్లర్ నివేదిక వెల్లడించింది.

భారత్ నుంచి బ్రెజిల్‌కు శుద్ధి చేసిన ఇంధన ఎగుమతులు గణనీయంగా పెరిగి రోజుకు 97 వేల బ్యారెళ్లకు చేరాయి. ఆగస్టులో ఈ సంఖ్య కేవలం 40 వేల బ్యారెళ్లుగా మాత్రమే ఉంది. టర్కీకి అంతకుముందు నెలతో పోలిస్తే 20 వేల బ్యారెళ్ల నుంచి 56 వేల బ్యారెళ్లకు ఎగుమతులు పెరిగాయి. గత ఏడాది మన దేశం నుంచి టర్కీకి చమురు ఎగుమతులు జరగలేదు. ప్రస్తుతం బ్రెజిల్, టర్కీ దేశాలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ చమురును ఎగుమతి చేస్తోంది.

యూఏఈకి భారత్ నుంచి శుద్ధి చేసిన ఇంధన ఎగుమతి పెరిగింది. ఆగస్టులో 1.4 లక్షల బ్యారెళ్ల ఇంధనం కొనుగోలు చేసిన యూఏఈ, సెప్టెంబర్‌లో 2.01 లక్షల బ్యారెళ్లకు పెంచింది. భారత్ నుండి శుద్ధి చేసిన ఇంధన ఎగుమతులు సెప్టెంబర్ నెలలో 14 శాతం వృద్ధిని నమోదు చేశాయి.


More Telugu News