భారత ప్రజాస్వామ్యంపై దాడి.. దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారు: రాహుల్‌పై భగ్గుమన్న బీజేపీ

  • కొలంబియాలో రాహుల్ గాంధీ చేసిన‌ వ్యాఖ్యలు దుమారం
  • దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ దాడికి గురవుతోందన్న‌ రాహుల్ 
  • విదేశీ గడ్డపై రాహుల్ వ్యాఖ్యల‌పై తీవ్రంగా స్పందించిన బీజేపీ
  • స్వాతంత్ర్య యోధులను అవమానించారంటూ తీవ్ర విమర్శ
  • దేశంలో ప్రజాస్వామ్యం లేదనడం సిగ్గుచేటన్న రవిశంకర్ ప్రసాద్
  • అధికారం దక్కడం లేదనే నైరాశ్యంతోనే రాహుల్ విమర్శలన్న క‌మ‌లం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటన మరోసారి రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. కొలంబియాలో ఆయన చేసిన వ్యాఖ్యలు భారత ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని, దేశ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నమని బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అధికారం చేజిక్కించుకోలేకపోతున్నామన్న నైరాశ్యంతోనే రాహుల్ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తింది.

కొలంబియా పర్యటనలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ... "బ్రిటిషర్లు దేశభక్తుల ప్రాణాలు తీసినా, భారత స్వాతంత్ర్య సమరయోధులు హింసాత్మకంగా స్పందించలేదు" అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యను బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది. ఇలాంటి మాటలతో మంగళ్ పాండే, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి విప్లవ వీరుల త్యాగాలను రాహుల్ అవమానించారని కమలం నేతలు మండిపడ్డారు. దేశం కోసం ప్రాణాలర్పించిన యోధులను కించపరచడం సరికాదని హితవు పలికారు.

బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. "భారత్‌లో సంపూర్ణ ప్రజాస్వామ్యం ఉంది. అందుకే మీరు దేశమంతా తిరుగుతూ ప్రధాని మోదీపై తప్పుడు ఆరోపణలు చేయగలుగుతున్నారు. కానీ విదేశాలకు వెళ్లి ప్రజాస్వామ్యం లేదనడం సిగ్గుచేటు. దేశాన్ని అవమానిస్తే, ఇప్పుడున్న సీట్లు కూడా ప్రజలు గెలిపించరనే విషయాన్ని రాహుల్ గుర్తుంచుకోవాలి" అని ఆయన అన్నారు. 

రాహుల్ గాంధీకి అధికారం కావాలని, ఓట్లు రావడం లేదనే అక్కసుతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ బీజేపీ శాఖ కూడా రాహుల్ వ్యాఖ్యలను ఖండించింది. రాజ్యాంగ విలువలను దెబ్బతీసేలా ఆయన పదేపదే ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది.

కొలంబియాలోని ఈఐఏ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో మాట్లాడుతూ, ప్రస్తుతం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ముప్పేట దాడికి గురవుతోందని, ఇదే దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ సేవలపై ఆధారపడి ఉండటం, ఉత్పత్తి రంగం బలంగా లేకపోవడం వల్ల ఉద్యోగాల కల్పన ఆశించిన స్థాయిలో జరగడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. చైనా అప్రజాస్వామిక వాతావరణంలో ఉత్పత్తి చేస్తుంటే, భారత్ ప్రజాస్వామ్య పద్ధతిలోనే దీనిని సాధించాల్సి ఉందని, ఇది సవాలుతో కూడుకున్నదని తెలిపారు.


More Telugu News