ప్రపంచ దేశాలకు భారత్ దారిచూపుతోంది: బిల్ గేట్స్

  • భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించిన బిల్ గేట్స్
  • ఆవిష్కరణల రంగంలో ఇండియా ఓ గ్లోబల్ లీడర్ అని కితాబు
  • 'వికసిత భారత్ 2047' లక్ష్యానికి మద్దతుగా ప్రకటన
  • భారత పరిష్కారాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి మేలు చేస్తాయని వ్యాఖ్య
  • అమెరికాలోని సియాటిల్‌లో గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న గేట్స్
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ భారత్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఆవిష్కరణల రంగంలో భారత్ ఒక ప్రపంచ స్థాయి నాయకుడిగా నిలుస్తోందని, అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకు మార్గదర్శకంగా ఉందని ఆయన కొనియాడారు. భారత పరిష్కారాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను మెరుగుపరిచే శక్తిని కలిగి ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

అమెరికాలోని సియాటిల్‌లో భారత కాన్సులేట్ జనరల్, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సంయుక్తంగా మహాత్మా గాంధీ 156వ జయంతి సందర్భంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి హాజరైన బిల్ గేట్స్ మాట్లాడుతూ... "ఈ రోజు భారత్ ఆవిష్కరణల్లో గ్లోబల్ లీడర్‌గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను కాపాడి, మెరుగుపరిచే పరిష్కారాలను అందిస్తోంది. 'వికసిత భారత్ 2047' లక్ష్య సాధనలో భారత్‌తో మా భాగస్వామ్యం కొనసాగుతుందని ఆశిస్తున్నాం" అని తెలిపారు. గాంధీజీ ఆశయాలైన సమానత్వం, గౌరవం తమ ఫౌండేషన్ పనికి పునాది వంటివని గేట్స్ పేర్కొన్నారు.

ఈ వేడుకల్లో భారతీయ సంస్కృతి, కళలు, సంప్రదాయ వంటకాలను ప్రదర్శించారు. వాషింగ్టన్, సియాటిల్ నగర ప్రభుత్వాల నుంచి సీనియర్ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో 'ప్రస్తుత ప్రపంచంలో గాంధీ విలువల ప్రాముఖ్యత' అనే అంశంపై యూఎస్ గ్లోబల్ సెక్యూరిటీ ఇన్‌స్టిట్యూట్ అధ్యక్షుడు జొనాథన్ గ్రానోఫ్ ప్రత్యేక ప్రసంగం చేశారు.

అంతకుముందు, బెల్వ్యూ పబ్లిక్ లైబ్రరీ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి, సియాటిల్ సెంటర్‌లోని గాంధీ విగ్రహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. వాషింగ్టన్ స్టేట్ సెనేటర్ వందనా స్లాటర్ పుష్పాంజలి ఘటించారు. సియాటిల్, బెల్వ్యూ నగరాల్లో జరిగిన ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భారత-అమెరికన్ సమాజం పాల్గొంది. ఈ సందర్భంగా చిన్నారులు గాంధీజీకి ఇష్టమైన భజన గీతాలను ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని భారత కాన్సులేట్ కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.


More Telugu News