బాలయ్య 'తాండవం' మొదలయ్యేది అప్పుడే.. 'అఖండ 2' విడుదల తేదీ ఖరారు

  • ఈ ఏడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి రానున్న 'అఖండ 2: తాండవం'
  • కొత్త పోస్టర్‌తో రిలీజ్ డేట్ ప్రకటించిన చిత్రబృందం
  • బోయపాటి శ్రీను దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్
  • చివరి దశలో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు
  • సంయుక్త హీరోయిన్‌గా, కీలక పాత్రలో ఆది పినిశెట్టి
నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'అఖండ 2: తాండవం' సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెలువడింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఈ ఏడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు గురువారం ప్రకటించారు. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయని చిత్ర వర్గాలు తెలిపాయి. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన టీజర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను మరింత భారీ స్థాయిలో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. విడుదల తేదీ పోస్టర్‌లో బాలకృష్ణ పొడవాటి జుట్టు, గడ్డంతో, ఒంటిపై రుద్రాక్ష మాలలతో, చేతిలో భారీ త్రిశూలం పట్టుకుని అఘోర గెటప్‌లో చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. ఆయన వెనుక మంచుతో కప్పబడిన వాతావరణం ఈ లుక్‌కు మరింత ఆకర్షణ తీసుకొచ్చింది.

14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బాలయ్య కుమార్తె ఎం. తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సంయుక్త హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆది పినిశెట్టి ఒక శక్తివంతమైన పాత్రలో, హర్షాలీ మల్హోత్రా మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. తమన్ అందిస్తున్న నేపథ్య సంగీతం సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను మరో స్థాయికి తీసుకెళుతుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. సి. రాంప్రసాద్, సంతోష్ డి. డెటకే సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, తమ్మిరాజు ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.


More Telugu News