ఖర్గేకు పేస్‌మేకర్.. బెంగళూరు ఆసుపత్రిలో కాంగ్రెస్ చీఫ్

  • అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన మల్లికార్జున ఖర్గే  
  • ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్న కుమారుడు ప్రియాంక్
  • ఖర్గే త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖుల ఆకాంక్ష
అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే (83)కు వైద్యులు పేస్ మేకర్ అమర్చనున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఖర్గే కుమారుడు ప్రియాంక్ తెలిపారు. బుధవారం జ్వరం, కాలు నొప్పితో బాధపడటంతో ఖర్గేను బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు పేస్ మేకర్ అమర్చాలని చెప్పారని తెలిపారు. ఖర్గే త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

మల్లికార్జున ఖర్గే ఆరోగ్యం గురించి తెలిసిన వెంటనే పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సోషల్ మీడియా వేదికగా అనేకమంది ఆయనకు ధైర్యం చెబుతూ సందేశాలు పంపుతున్నారు. ఖర్గే చికిత్స విజయవంతం కావాలని, పూర్తి ఆరోగ్యంతో త్వరలోనే తిరిగి రావాలని పలువురు ప్రముఖులు ఎక్స్‌లో ఆకాంక్షించారు.


More Telugu News