భారత ధనవంతుల జాబితాలోకి పర్‌ఫ్లెక్సిటీ సీఈవో అరవింద్ శ్రీనివాస్

  • హూరున్ విడుదల చేసిన జాబితాలో అరవింద్ శ్రీనివాస్
  • ఆయన సంపద రూ. 21,190 కోట్లుగా అంచనా
  • దేశ సంపన్నుల్లో అతి పిన్నవయస్కుడిగా నిలిచిన అరవింద్
ఏఐ ఆధారిత సెర్చింజన్ 'పర్‌ఫ్లెక్సిటీ' సంస్థ సీఈవో అరవింద్ శ్రీనివాస్ భారత సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. హూరున్ విడుదల చేసిన భారత కుబేరుల జాబితా ఈ విషయాన్ని వెల్లడించింది. ఆయన సంపదను రూ. 21,190 కోట్లుగా అంచనా వేశారు. ఈ జాబితాలో దేశంలోని సంపన్నుల్లో అరవింద్ శ్రీనివాస్ అతి పిన్న వయస్కుడిగా నిలిచారు.

హూరున్ విడుదల చేసిన ఈ జాబితాలో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మొదటి స్థానంలో ఉండగా, గౌతమ్ అదానీ రెండో స్థానంలో నిలిచారు.

శ్రీనివాస్ 1994 జూన్ 7న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. ఐఐటీ మద్రాస్‌లో చదువుతున్నప్పుడు రీఫోర్స్‌మెంట్ లెర్నింగ్, అడ్వాన్స్‌డ్ రీఫోర్స్‌మెంట్ లెర్నింగ్‌పై కోర్సులు బోధించారు. అనంతరం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్కెలీలో కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు.

ఆయన తొలుత ఓపెన్ ఏఐలో రీఫోర్స్‌మెంట్ లెర్నింగ్‌పై పని చేశారు. తర్వాత లండన్‌లోని డీప్‌మైండ్‌లో కాంట్రాస్టివ్ లెర్నింగ్‌పై దృష్టి సారించారు. అనంతరం గూగుల్‌లో విజన్ మోడల్స్ హాలోనెట్, రెజ్‌నెట్-ఆర్ఎస్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. తిరిగి ఓపెన్ఏఐలో రీసెర్చ్ సైంటిస్ట్‌గా చేరి టెక్స్ట్ టు ఇమేజ్ మోడల్ డాల్-ఈ-2 అభివృద్ధిలో సహకరించారు.


More Telugu News