2028లో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తున్నాం: రామచందర్ రావు

  • కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ఓట్లు అడిగే అర్హత లేదన్న రామచందర్ రావు
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని వెల్లడి
  • ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శ
2028లో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓట్లు అడిగే అర్హత లేదని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రూ. 40 వేల కోట్ల విలువైన ఎరువులను రాయితీపై అందిస్తోందని ఆయన గుర్తు చేశారు. ఎరువుల కొరతను అడ్డుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిందను కేంద్రంపై నెట్టడం సరికాదని ఆయన అన్నారు. బీసీ రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన పునరుద్ఘాటించారు.


More Telugu News