విలీన మండలాల్లో వరద బీభత్సం.. వంద గ్రామాలకు తెగిన సంబంధాలు

  • విలీన మండలాల్లో వరద బీభత్సం.. శబరి, గోదావరి పోటు
  • అల్లూరి జిల్లాను ముంచెత్తిన వరద.. భద్రాచలానికి నిలిచిన రాకపోకలు
  • ప్రమాదకర స్థాయిలో గోదావరి.. నీట మునిగిన ఏజెన్సీ గ్రామాలు
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాలను వరదలు ముంచెత్తుతున్నాయి. గోదావరి, దాని ఉపనది శబరి ఉగ్రరూపం దాల్చడంతో ఏజెన్సీ ప్రాంతం అతలాకుతలమవుతోంది. వరదనీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో దాదాపు వంద గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

గోదావరి నది నీటిమట్టం కూనవరం వద్ద 47.75 అడుగులకు చేరి ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. దీంతో పలు ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరింది. ముఖ్యంగా కూనవరం మండలం పోలిపాక, దూగుట్ట వద్ద రోడ్లు నీట మునగడంతో చింతూరు – కూనవరం మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. అదేవిధంగా, ఎటపాక మండలం నందిగామ, నెల్లిపాక ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా వరద చేరడంతో విలీన మండలాల నుంచి భద్రాచలానికి వెళ్లే మార్గం మూసుకుపోయింది.

వరద ప్రభావంతో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వీఆర్ పురం మండలంలోని శ్రీరామగిరి, వడ్డిగూడెం, చింతరేవుపల్లి గ్రామాలు పూర్తిగా నీటితో నిండిపోయాయి. కూనవరంలోని భాస్కర కాలనీ, గిన్నెల బజార్‌లోని ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించే పనులను అధికారులు చేపట్టారు.

పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందన్న అంచనాతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. శబరి, గోదావరి నదుల ఉద్ధృతితో వందకు పైగా గిరిజన గ్రామాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. 


More Telugu News