హీరోయిన్ డింపుల్ హయతిపై కేసు నమోదు

  • జీతం ఇవ్వకుండా ఇంట్లోంచి గెంటేశారని ఒడిస్సాకు చెందిన పనిమనిషి ఫిర్యాదు
  • నగ్నంగా చేసి వీడియో తీయాలని చూశారంటూ బాధితురాలి తీవ్ర ఆరోపణ
  • గతంలో ఐపీఎస్ అధికారితో వివాదం, ఇప్పుడు మరో కేసులో నటి
వివాదాలతో తరచూ వార్తల్లో నిలిచే సినీ నటి డింపుల్ హయతి, తాజాగా మరో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన ఇంట్లో పనిచేస్తున్న సహాయకురాలికి జీతం ఇవ్వకుండా చిత్రహింసలకు గురిచేశారన్న ఫిర్యాదుపై ఆమె, ఆమె భర్తపై హైదరాబాద్‌లోని ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఘటనతో ఆమె మరోసారి చర్చనీయాంశంగా మారారు.

వివరాల్లోకి వెళితే, డింపుల్ హయతి ఇంట్లో ఒడిస్సాకు చెందిన ఇద్దరు యువతులు కొంతకాలంగా పనిచేస్తున్నారు. అయితే, వారికి సరైన జీతం ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. జీతం అడిగినందుకు తమను చిత్రహింసలు పెట్టడమే కాకుండా, ఉన్నపళంగా ఇంట్లోంచి బయటకు గెంటేశారని ఆరోపిస్తూ బాధితులు ఆమె నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ వద్ద ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

బాధితులలో ఒకరైన పనిమనిషి ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. జీతం ఇవ్వకపోగా, కుక్క అరిచిందన్న చిన్న కారణంతో తనపై దాడి చేయబోయారని, నగ్నంగా చేసి ఆ దృశ్యాలను వీడియో తీసేందుకు ప్రయత్నించారని ఆమె తన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేశారు. తన భర్త లాయర్ అంటూ డింపుల్ తమను బెదిరించినట్లు కూడా బాధితురాలు పేర్కొన్నారు.

గతంలోనూ ఓ ఐపీఎస్ అధికారితో గొడవపడి డింపుల్ హయతి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ తాజా ఘటనతో ఆమె చిక్కుల్లో పడ్డారు. పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు డింపుల్ హయతితో పాటు ఆమె భర్తపైనా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఆరోపణలపై డింపుల్ హయతి వైపు నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. 


More Telugu News