ఏకంగా 1,020 సినిమాలను హ్యాక్ చేశాడు... పోలీసుల విచారణలో సంచలన విషయాల వెల్లడి

  • పాట్నాకు చెందిన 22 ఏళ్ల హ్యాకర్‌ను అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు
  • వెయ్యికి పైగా కొత్త సినిమాలు, ప్రభుత్వ వెబ్‌సైట్లు హ్యాక్ చేసిన వైనం
  • కేవలం కిక్ కోసమే నేరాలకు పాల్పడినట్లు యువకుడి వెల్లడి
కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే చదివిన ఓ 22 ఏళ్ల కుర్రాడు, తన హ్యాకింగ్ నైపుణ్యంతో పోలీసులనే నివ్వెరపరిచాడు. కొత్తగా విడుదలైన 1020 సినిమాలను హ్యాక్ చేయడమే కాకుండా, బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్లను సైతం క్రాక్ చేసి కలకలం సృష్టించాడు. ఇదంతా ఎందుకు చేశావని పోలీసులు ప్రశ్నించగా, "కేవలం కిక్ కోసం" అని అతను ఇచ్చిన సమాధానం విని అధికారులు విస్తుపోయారు.

వివరాల్లోకి వెళితే, బీహార్‌లోని పాట్నాకు చెందిన అశ్వినీ కుమార్ (22) అనే యువకుడిని తెలంగాణ పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతని గురించి దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నప్పుడు ఒక కన్ను సరిగా కనపడకపోవడంతో తోటివారు "ఒంటికన్ను శివరాజన్" అని హేళన చేసేవారు. ఈ అవమానంతో తనను తాను నిరూపించుకోవాలనే కసి పెంచుకున్న అశ్వినీ, యూట్యూబ్ చూసి హ్యాకింగ్ నేర్చుకున్నాడు. జావా, పైథాన్ వంటి కోడింగ్ భాషలపై పట్టు సాధించి, సైబర్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు.

మొదట్లో కొత్త సినిమాల సర్వర్లను హ్యాక్ చేసి, అందరికంటే ముందే సినిమా చూస్తూ ఆనందం పొందేవాడు. క్రమంగా కొన్ని ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు ఇతనిని సంప్రదించాయి. కొత్త సినిమాలను పైరసీ చేసి తమకు అందిస్తే, డబ్బు ఇస్తామని చెప్పడంతో ఆ దిశగా అడుగులు వేశాడు. వాటి నుంచి ప్రతినెలా లక్షల రూపాయలను బిట్‌కాయిన్ల రూపంలో అందుకున్నాడు.

అంతటితో ఆగకుండా, తన నైపుణ్యాన్ని పరీక్షించుకోవడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్లతో పాటు ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌ను కూడా హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు తనను పట్టుకోకుండా ఉండేందుకు ఇంటి చుట్టూ 22 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాడు. పోలీసులు ఇంటికి రాగానే తన మొబైల్‌లోని డేటాను క్షణాల్లో డిలీట్ చేశాడు. అయితే, అతని హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు, అందులోని సమాచారాన్ని చూసి అతని ప్రతిభకు ఆశ్చర్యపోయారు. చిన్నప్పుడు ఎదురైన అవమానాలే తనను ఈ మార్గం వైపు నడిపించాయని, ప్రధానంగా ఒక రకమైన థ్రిల్ కోసమే ఇదంతా చేశానని అశ్వినీ చెప్పడం గమనార్హం.


More Telugu News