వైసీపీ నేతలపై కేసు .. క్షణాల్లో ఆ సీఐ వీఆర్‌కు

  • కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై అసభ్య పోస్టులు
  • వైసీపీ నేతలపై కేసు నమోదు చేసిన సీఐ రామకృష్ణ యాదవ్
  • సీఐని విఆర్‌కు పంపుతూ ఆదేశాలు
టీడీపీ మహిళా ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ నేతలపై కేసు నమోదు చేసిన పోలీసు అధికారిని వీఆర్‌లోకి పంపడం ఇప్పుడు కడప జిల్లాలో హాట్ టాపిక్ అయింది. 

కడప వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్ సీఐ రామకృష్ణ యాదవ్ తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ఆర్. మాధవిరెడ్డి ఫిర్యాదు మేరకు వైసీపీ నేతలు అంజాద్ బాషా, ఆయన సోదరుడు అహ్మద్ బాషా, పీఏ ఖాజాలపై కేసు నమోదు చేశారు. అయితే, కేసు నమోదు చేసిన కొద్దిసేపటికే ఆయన్ను వీఆర్‌లోకి (విజిలెన్స్ రిజర్వ్) పంపుతూ ఉత్తర్వులు వెలువడడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
 
ఘటనల క్రమం ఇలా...

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారంపై ఆమె భర్త శ్రీనివాసులురెడ్డి ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐ రామకృష్ణ యాదవ్ కేసు నమోదు చేశారు. కేసులో వైసీపీ మాజీ ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఆయన సోదరుడు అహ్మద్ బాషా, పీఏ ఖాజా పేర్లు నిందితులుగా నమోదయ్యాయి. ఆ వెంటనే సీఐ రామకృష్ణ యాదవ్‌ను వీఆర్‌లోకి పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు.
 
కేసు పెట్టడం నేరమా?

“అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటే పోలీస్ అధికారిని శిక్షించడమా?” అని టీడీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. వైసీపీ కీలక నేతల పేర్లు కేసులో చేర్చినందుకే సీఐపై చర్యలు తీసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ అనుకూల పోలీసు అధికారుల ఒత్తిడితోనే ఈ పరిణామం చోటుచేసుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
 
వైసీపీ హయాంలోనూ వీఆర్‌లో ఈ సీఐ 

సీఐ రామకృష్ణ యాదవ్ గతంలో వైసీపీ హయాంలోనూ వేధింపులకు గురయ్యారని సమాచారం. 2019 తర్వాత వన్‌టౌన్ సీఐగా పనిచేస్తుండగా బదిలీ చేసి వీఆర్‌లో ఉంచిన నాటి  ప్రభుత్వం, అనంతపురం జిల్లాకు పంపి అక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా రెండేళ్లపాటు వీఆర్‌లోనే ఉంచినట్లు తెలుస్తోంది.

అప్పట్లోనూ అంజాద్ బాషా ఒత్తిడి కారణంగానే ఆయనను జిల్లా నుంచి పంపినట్లు రాజకీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. సీఐపై తీసుకున్న చర్యను పునరాలోచించాలని టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 


More Telugu News