చెన్నైలో కలకలం... 9 విదేశీ రాయబార కార్యాలయాలకు బాంబు బెదిరింపులు

  • ఈమెయిల్స్ ద్వారా హెచ్చరికలు పంపిన ఆగంతుకులు
  • బెదిరింపు మెయిల్స్‌లో సెంథిల్ బాలాజీ పేరు ప్రస్తావన
  • అప్రమత్తమైన పోలీసులు.. కాన్సులేట్లలో ముమ్మర తనిఖీలు
  • రాయబార కార్యాలయాల వద్ద భారీగా భద్రతా బలగాల మోహరింపు
చెన్నై మహానగరంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా తొమ్మిది విదేశీ రాయబార కార్యాలయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ ఘటనతో తమిళనాడు పోలీసు విభాగం, భద్రతా ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి.

మంగళవారం నాడు తేనాంపేటలోని అమెరికా కాన్సులేట్‌తో పాటు బ్రిటన్, ఆస్ట్రేలియా, సింగపూర్, శ్రీలంక వంటి మరో ఎనిమిది దేశాల ఎంబసీలకు ఆగంతకుల నుంచి ఈమెయిల్స్ అందాయి. ఆయా ఎంబసీ కార్యాలయాల్లో బాంబులు పెట్టామంటూ వచ్చిన ఈ హెచ్చరికలతో భద్రతా బలగాలు తక్షణమే రంగంలోకి దిగాయి.

పది వేర్వేరు ఈమెయిల్ ఐడీల నుంచి డీజీపీ కార్యాలయానికి ఈ బెదిరింపు సందేశాలు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మెయిల్స్‌లో డీఎంకే మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ పేరును, కరూరు తొక్కిసలాట ఘటనను ప్రస్తావించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

హెచ్చరికల నేపథ్యంలో, చెన్నై పోలీసులు నగరంలోని అన్ని కాన్సులేట్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో ప్రతి అంగుళం క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఎంబసీల పరిసరాల్లో భద్రతా బలగాలను భారీగా మోహరించి, ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతానికి ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదని, అయితే దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ఇదే తరహాలో ముంబయి-దిల్లీ ఇండిగో విమానానికి కూడా బాంబు బెదిరింపు రావడం గమనార్హం. ఈ వరుస ఘటనల వెనుక ఉన్న వారిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక బృందాలతో విచారణ జరుపుతున్నారు.


More Telugu News