ట్రంప్ తీరుతో కీలకమైన భారత్‍ను కోల్పోయే ప్రమాదం ఉంది: అమెరికా మాజీ అధికారి తీవ్ర ఆగ్రహం

  • భారత్ విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న తీరును తప్పుబట్టిన జాన్ బోల్టన్
  • సుంకాలు వాణిజ్యం గురించి కాకుండా కక్షతో విధిస్తున్నట్లుగా ఉందని విమర్శ
  • ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామిని కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన
రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్న చైనాను వదిలి, కేవలం భారత్‌పై టారిఫ్ పేరుతో ఆంక్షలు విధించడం సరికాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరును ఆ దేశ మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ విమర్శించారు. భారత్ విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న విధానాన్ని ఆయన తప్పుబట్టారు. చైనా, రష్యాను విడిచిపెట్టి కేవలం భారత్‌పై సుంకాలు విధించడమేమిటని ఆయన ప్రశ్నించారు.

ఈ సుంకాలను వాణిజ్యం గురించి కాకుండా వ్యక్తిగత కక్షతో విధిస్తున్నట్లుగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రంప్ అనాలోచిత నిర్ణయాల వల్ల అమెరికా ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామిని కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ కొన్ని లక్ష్యాలతో రెండోసారి అధికారంలోకి వచ్చారని, అందుకోసం ఆయన దేనికైనా సిద్ధమవుతున్నారని విమర్శించారు.

అమెరికా రాజకీయాల్లో ఏమాత్రం ఆమోదయోగ్యం కాని విధంగా ఆయన వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. అమెరికాలో గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి పరిస్థితులు రాకూడదని జాన్ బోల్టన్ ఆకాంక్షించారు.


More Telugu News