ఆలయాలకు రూ.10 వేలు, అర్చకులకు రూ.15 వేలు ఇస్తున్నాం: మంత్రి ఆనం

  • హిందూ ధర్మానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న ఆనం
  • రాష్ట్రంలోని 5,600 ఆలయాలకు ఆర్థిక సాయం అందిస్తున్నామని వెల్లడి
  • 600 మంది వేద విద్యార్థులకు నెలకు రూ.3 వేల ఉపకార వేతనం ఇస్తామన్న మంత్రి
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం హిందూ ధర్మానికి, సంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 5,600 ఆలయాల్లో ధూప దీప నైవేద్యాల కోసం రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తున్నామని ఆయన ప్రకటించారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హిందూ ధర్మానికి సంబంధించిన హామీలను వేగంగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మరిన్ని వివరాలు వెల్లడిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా 600 మంది వేద విద్యార్థులకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి అందిస్తున్నామని మంత్రి తెలిపారు. అర్చకులకు రూ.15 వేలు, దేవాలయాల్లో పనిచేస్తున్న నాయీబ్రాహ్మణులకు రూ.25 వేల చొప్పున భృతిని కల్పిస్తున్నామని వివరించారు. దేవాలయ ట్రస్ట్ బోర్డులలో నాయీబ్రాహ్మణులకు సభ్యులుగా అవకాశం కల్పించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించామని పేర్కొన్నారు.

దేవాలయాల ఆస్తుల పరిరక్షణ తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని మంత్రి ఆనం ఉద్ఘాటించారు. ఇందుకోసం స్పెషల్ చీఫ్ సెక్రటరీ, డీజీపీలతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో హిందూ సంప్రదాయాలను పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆయన తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందూ ధర్మానికి సంబంధించి ఇచ్చిన హామీలలో ఇప్పటికే 98 శాతం పూర్తి చేసిందని ఆయన స్పష్టం చేశారు. 


More Telugu News