పద్మశ్రీ అవార్డు గ్రహీత ఇల్లు కూల్చివేత.. ఉత్తర ప్రదేశ్‌లో రాజకీయ దుమారం

  • హాకీ మాజీ ఆటగాడి ఇంటిలో కొంత భాగం కూల్చివేసిన అధికారులు
  • 1980 ఒలింపిక్స్‌లో భారత్ స్వర్ణపతకం సాధించిన జట్టులో షాహిద్ సభ్యుడు
  • వారణాసిలోని ఆయన ఇంటిలో కొంతభాగం కూల్చివేత
రోడ్డు విస్తరణలో భాగంగా ఒలింపియన్, హాకీ మాజీ ఆటగాడి ఇంటిలో కొంత భాగాన్ని అధికారులు కూల్చివేయడం ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో రాజకీయ దుమారం రేపింది. ఈ కూల్చివేతపై కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శలు చేస్తుండగా, కూల్చివేతలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మాజీ ఆటగాడి భార్య స్పష్టం చేశారు.

1980 ఒలింపిక్స్‌లో భారత్ స్వర్ణపతకం సాధించిన జట్టులో మహమ్మద్ షాహిద్ సభ్యుడు. 2016లో ఆయన మృతి చెందారు. షాహిద్ పూర్వీకుల ఇల్లు కచేరీ-సంధహా మార్గంలో ఉంది. రోడ్డు విస్తరణలో భాగంగా అధికారులు ఆ ఇంటిలోని కొంత భాగాన్ని బుల్డోజర్లతో కూల్చివేశారు.

ఈ కూల్చివేతపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్మశ్రీ మహమ్మద్ షాహిద్ ఇంటిని బీజేపీ ప్రభుత్వం కూల్చివేసిందని, ఇది కేవలం ఇల్లు కాదని, దేశ క్రీడా వారసత్వానికి నిదర్శనమని ఆయన 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. కాశీలోని ప్రముఖులను అవమానించే బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరని ఆయన అన్నారు.

ఆజాద్ సమాజ్ పార్టీ అధినేత, ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ కూడా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీజేపీ బుల్డోజర్ ప్రభుత్వానికి మానవత్వం, దేశ వీరులపై గౌరవం లేవని మండిపడ్డారు. అయితే ఈ కూల్చివేతకు సంబంధించి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని షాహిద్ భార్య పర్వీన్ పేర్కొన్నారు. ఈ మేరకు తమకు నష్టపరిహారం కూడా అందిందని తెలిపారు.


More Telugu News