పాకిస్థాన్ బౌలర్‌కు అశ్విన్ స్పెషల్ థ్యాంక్స్

  • ఆసియా కప్ ఫైనల్లో పాక్‌పై టీమిండియా విజయం
  • పాక్ బౌలర్ హరీస్ రవూఫ్‌కు వ్యంగ్యంగా కృతజ్ఞతలు తెలిపిన అశ్విన్
  • భారత్ విజయాన్ని రవూఫ్ సులభం చేశాడంటూ చురకలు
  • ఒత్తిడిలో అద్భుతంగా ఆడిన తిలక్ వర్మపై ప్రశంసల వర్షం
  • భారత స్పిన్నర్లు కుల్‌దీప్, వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేశారన్న అశ్విన్
ఆసియా కప్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించి టీమిండియా విజేతగా నిలవడంలో పాక్ పేసర్ హరీస్ రవూఫ్ కీలక పాత్ర పోషించాడంటూ భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ సెటైర్లు వేశాడు. ధారాళంగా పరుగులు సమర్పించుకుని భారత్ విజయాన్ని సులభతరం చేసినందుకు అతడికి కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ తన యూట్యూబ్ ఛానల్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

ఈ మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమించి తిలక్ వర్మ ఆడిన ఇన్నింగ్స్‌ను అశ్విన్ ప్రత్యేకంగా ప్రశంసించాడు. “తిలక్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిని తట్టుకుని నిలబడ్డాడు. స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ, స్వీప్ షాట్లను చక్కగా ఆడాడు. బంతిని గాల్లోకి లేపకుండా నేల మీదుగా ఆడి సక్సెస్ అయ్యాడు” అని అశ్విన్ విశ్లేషించాడు.

147 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ ఒక దశలో 20 పరుగులకే అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో తిలక్ వర్మ (53 బంతుల్లో 69 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. అయితే, పాక్ బౌలర్ హరీస్ రవూఫ్ కేవలం 3.4 ఓవర్లలోనే 50 పరుగులు ఇవ్వడం భారత్‌కు కలిసొచ్చిందని అశ్విన్ పేర్కొన్నాడు. “మేం ఇంత తేలిగ్గా గెలవడానికి సహకరించిన హరీస్ రవూఫ్‌కు థ్యాంక్స్ చెప్పాలి” అని అశ్విన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.

భారత బౌలర్ల ప్రదర్శనపైనా అశ్విన్ మాట్లాడాడు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి, కుల్‌దీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్‌పై పట్టు సాధించడంలో సాయపడ్డారని చెప్పాడు. పాకిస్థాన్ బ్యాటర్లతో పోలిస్తే, శ్రీలంక ఆటగాళ్లు భారత స్పిన్నర్లను మెరుగ్గా ఎదుర్కొన్నారని, వారి షాట్ల ఎంపిక కూడా బాగుందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 146 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. 


More Telugu News