ఒక్క ఫ్లాట్ ధర రూ. 500 కోట్లు.. సన్‌టెక్ రియాల్టీ సంచలనం!

  • సన్‌టెక్ రియాల్టీ నుంచి అల్ట్రా లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులు
  • ఒక్కో ఫ్లాట్ ధర రూ. 100 కోట్ల నుంచి రూ. 500 కోట్లు
  • 'ఎమాన్సే' పేరుతో సరికొత్త బ్రాండ్ ఆవిష్కరణ
  • ముంబై, దుబాయ్‌లో అత్యంత ఖరీదైన నిర్మాణాలు
  • ఆహ్వానం ఉన్నవారికే కొనుగోలు చేసే అవకాశం
  • ఈ ప్రాజెక్టుల ద్వారా రూ. 20 వేల కోట్ల ఆదాయం లక్ష్యం
రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త సంచలనం నమోదైంది. దేశంలోని ప్రముఖ రియల్టీ సంస్థ సన్‌టెక్ రియాల్టీ లిమిటెడ్, అల్ట్రా లగ్జరీ హౌసింగ్ విభాగంలోకి అడుగుపెడుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. అత్యంత సంపన్న వర్గాలను లక్ష్యంగా చేసుకొని ఒక్కో ఫ్లాట్‌ను ఏకంగా రూ. 100 కోట్ల నుంచి రూ. 500 కోట్ల ధరతో విక్రయించనున్నట్లు ప్రకటించింది. గతంలో గురుగ్రామ్‌లో ఓ ఫ్లాట్ రూ. 100 కోట్లకు అమ్ముడుపోవడం వార్త కాగా, ఇప్పుడు సన్‌టెక్ ఆ రికార్డును బద్దలుకొట్టేందుకు సిద్ధమైంది.

ఈ అత్యంత ఖరీదైన ప్రాజెక్టుల కోసం సన్‌టెక్ రియాల్టీ 'ఎమాన్సే' అనే సరికొత్త బ్రాండ్‌ను పరిచయం చేసింది. ఈ బ్రాండ్ కింద నిర్మించే ఇళ్లను కేవలం ఆహ్వానం (బై ఇన్వైట్ ఓన్లీ) ద్వారా మాత్రమే విక్రయిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. తమ ఫ్లాట్ల కనీస ధర రూ. 100 కోట్లుగా ఉంటుందని, గరిష్టంగా రూ. 500 కోట్ల వరకు పలుకుతుందని సన్‌టెక్ రియాల్టీ సీఎండీ కమల్ ఖేతన్ తెలిపారు.

ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను ముంబై, దుబాయ్‌లలో నిర్మించనున్నారు. ముంబైలోని నీపెన్సీ రోడ్‌తో పాటు, దుబాయ్ డౌన్‌టౌన్, బుర్జ్ ఖలీఫా కమ్యూనిటీలో ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు. సన్‌టెక్ రియాల్టీకి ఇదే తొలి విదేశీ ప్రాజెక్ట్ కావడం గమనార్హం. దుబాయ్ ప్రాజెక్టు పనులను 2026 జూన్ నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా దాదాపు రూ. 20 వేల కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నారు.

ఈ ప్రాజెక్టులలో చదరపు అడుగు నిర్మాణ వ్యయమే రూ. 2.5 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. దీంతో ఇవి దేశంలోనే అత్యంత ఖరీదైన నివాస ప్రాజెక్టులలో ఒకటిగా నిలవనున్నాయి. సన్‌టెక్ రియాల్టీ సుమారు 52.5 మిలియన్ చదరపు అడుగుల పోర్ట్‌ఫోలియోతో దేశంలోని అగ్రగామి రియల్టర్లలో ఒకటిగా కొనసాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 47 శాతం పెరిగి రూ. 33.43 కోట్లకు చేరింది. అయితే, ఆదాయం రూ. 328 కోట్ల నుంచి రూ. 201 కోట్లకు తగ్గింది.


More Telugu News