మత్స్యకారులను బయటి వ్యక్తులు రెచ్చగొడుతున్నారు: హోంమంత్రి అనిత

  • నిరసన వ్యక్తం చేస్తున్న మత్స్యకారులతో మాట్లాడిన మంత్రి అనిత
  • బల్క్ డ్రగ్ పార్కు పనులు తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించిన మంత్రి అనిత
  • మత్స్యకారులతో రాజకీయం చేయడం సరైంది కాదన్న మంత్రి అనిత
నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కు అంశంలో మత్స్యకారులను బయటి వ్యక్తులు రెచ్చగొడుతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. ఈ విషయంలో మంత్రి అనిత కీలక ప్రకటన చేశారు.

నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట వద్ద ఏర్పాటు చేయబోయే బల్క్‌ డ్రగ్‌ పార్కుపై జరుగుతున్న ప్రజా వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని, పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించినట్లు మంత్రి అనిత వెల్లడించారు. ఈ అంశంపై స్థానిక నిరసనకారులతో ఆమె సమావేశమయ్యారు.

హోంమంత్రి అనిత మాట్లాడుతూ రాజయ్యపేట వాసులు, అన్ని రాజకీయ పార్టీల నేతలతో అఖిలపక్ష కమిటీని ఏర్పాటుచేస్తామని తెలిపారు. వారి సమస్యలను డిప్యూటీ ముఖ్యమంత్రికి వివరించేందుకు తీసుకెళ్తానని చెప్పారు. ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తామని, ఎవరిపైనా బలవంతం చేయబోమని మంత్రి హామీ ఇచ్చారు.

అయితే ఈ ఉద్యమాన్ని కొంత మంది బయటి వ్యక్తులు రెచ్చగొడుతున్నారని ఆమె ఆరోపించారు. మత్స్యకారులతో రాజకీయాలు చేయడం సరైంది కాదని హితవు పలికారు. ప్రజల సమస్యలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటునకు ప్రజలు అందరూ స్వాగతిస్తున్నారని మంత్రి తెలిపారు. రాజయ్యపేట ప్రజల సమస్యకు పరిష్కారం దిశగా ముందుకు వెళతామని స్పష్టం చేశారు. 


More Telugu News