రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు... మంత్రి నారా లోకేశ్ స్పందన

  • విద్యుత్ ట్రూ-అప్ ఛార్జీలను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
  • యూనిట్‌పై 13 పైసలు తగ్గింపునకు ప్రభుత్వ నిర్ణయం
  • దేశంలోనే తొలిసారిగా 'ట్రూడౌన్' విధానం అమలు
  • నవంబర్ నెల నుంచి వినియోగదారులకు ఊరట
  • సమర్థ నిర్వహణ వల్లే ఇది సాధ్యమైందన్న సీఎం చంద్రబాబు
  • ఇది ప్రజా ప్రభుత్వమని మరోసారి రుజువు చేశామన్న మంత్రి లోకేశ్
రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. దేశంలోనే తొలిసారిగా 'ట్రూడౌన్' విధానాన్ని అమలు చేస్తూ విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ప్రజలపై ఏకంగా రూ.923 కోట్ల భారం తగ్గనుండగా, వచ్చే నవంబర్ నెల నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. యూనిట్‌కు 13 పైసలు చొప్పున తగ్గిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ప్రకటించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పందిస్తూ "దేశ చరిత్రలో ట్రూడౌన్ ద్వారా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్న తొలి రాష్ట్రం మనదే. ఈ నిర్ణయాన్ని ప్రకటించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఈ భారాన్ని తగ్గిస్తున్నాం" అని తెలిపారు. గత 15 నెలలుగా విద్యుత్ వ్యవస్థల సమర్థవంతమైన నిర్వహణ, సరైన ప్రణాళికల వల్లే ఈ సానుకూల ఫలితం సాధ్యమైందని ఆయన వివరించారు.

ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి చంద్రబాబు వివరిస్తూ, "ఇతర రాష్ట్రాలతో 'పవర్ స్వాపింగ్' విధానాన్ని అనుసరించడం ద్వారా విద్యుత్ కొనుగోళ్ల భారాన్ని గణనీయంగా తగ్గించగలిగాం. డిమాండ్ ఎక్కువగా ఉండే సమయాల్లో (పీక్ అవర్స్) అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరాన్ని అధిగమించాం. ఈ విధానం వల్ల ఆదా అయిన ప్రయోజనాన్ని ఇప్పుడు ట్రూడౌన్ రూపంలో ప్రజలకు అందిస్తున్నాం" అని పేర్కొన్నారు.

ప్రభుత్వం చేపడుతున్న ఇతర సంక్షేమ కార్యక్రమాలను కూడా ఆయన ప్రస్తావించారు. 'పీఎం కుసుమ్' పథకం కింద రైతులకు ఉచితంగా సౌర విద్యుత్ అందిస్తున్నామని గుర్తు చేశారు. అదేవిధంగా, 'పీఎం సూర్యఘర్' పథకం కింద ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పూర్తి ఉచితంగా సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకంలో భాగంగా బీసీ వినియోగదారులకు గరిష్టంగా రూ.98,000 వరకు సబ్సిడీ అందిస్తున్నట్లు వెల్లడించారు. విద్యుత్ గ్రిడ్‌ను స్థిరీకరించేందుకు రాష్ట్రంలో 1,500 మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

రానున్న రోజుల్లో 'క్లీన్ ఎనర్జీ పాలసీ'ని తీసుకువచ్చి, పెద్ద ఎత్తున సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తద్వారా ప్రజలకు మరింత చౌకగా, నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో తాము తీసుకొచ్చిన మార్పు భవిష్యత్తులో మరిన్ని అద్భుత ఫలితాలను సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మంత్రి నారా లోకేశ్ ఏమన్నారంటే...!

ఈ నిర్ణయంతో ప్రజలపై సుమారు వెయ్యి కోట్ల రూపాయల భారం తగ్గనుందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఎన్నికల ముందు ఇచ్చిన మరో ముఖ్యమైన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం నిలబెట్టుకుందని ఆయన పేర్కొన్నారు.

ఈ మేరకు మంత్రి లోకేశ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ప్రజా ప్రభుత్వం అంటే ఏమిటో తమ ప్రభుత్వం మరోసారి నిరూపించిందని ఆయన వ్యాఖ్యానించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేశారని ఆయన తీవ్రంగా విమర్శించారు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు (పీపీఏ) రద్దు చేయడం నుంచి మొదలుకొని, ట్రూ-అప్ ఛార్జీల పేరుతో ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు.

గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యుత్ వ్యవస్థ నిర్వీర్యమైందని, దాని భారాన్ని ప్రజలపై మోపారని లోకేశ్ విమర్శించారు. ఇప్పుడు తమ ప్రభుత్వం తీసుకున్న ట్రూ-అప్ ఛార్జీల తగ్గింపు నిర్ణయం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రూ-డౌన్ నిర్ణయంతో రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు సుమారు వెయ్యి కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరుతుందని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.


More Telugu News