టీమిండియా విక్టరీపై మోదీ పోస్టుకు లక్ష రీట్వీట్లు

  • ఆసియా కప్ ఫైనల్‌లో పాక్‌పై టీమిండియా విజయం
  • గెలుపును 'ఆపరేషన్ సిందూర్'తో పోల్చిన ప్రధాని మోదీ
  • సోషల్ మీడియాలో ప్రధాని ట్వీట్‌కు వెల్లువెత్తిన మద్దతు
  • లక్షకు పైగా రీట్వీట్లు, కోట్లలో ఇంప్రెషన్లు
  • క్రీడల్లోకి రాజకీయాలు తెస్తున్నారంటూ కాంగ్రెస్ విమర్శ
  • బీజేపీ విభజన రాజకీయాలకు నిదర్శనమని ఆరోపణ
ఆసియా కప్ ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ సాధించిన ఉత్కంఠ విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ఒకే ఒక్క ట్వీట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది. టీమిండియా గెలుపును 'ఆపరేషన్ సిందూర్'తో పోల్చడంపై సోషల్ మీడియాలో ఆయనకు భారీ మద్దతు లభిస్తుండగా, విపక్షాలు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నాయి.

ఆదివారం రాత్రి ఆసియా కప్‌ను భారత్ కైవసం చేసుకున్న వెంటనే ప్రధాని మోదీ 'ఎక్స్' వేదికగా స్పందించారు. "ఆట మైదానంలో ఆపరేషన్ సిందూర్. ఫలితం ఒక్కటే - భారత్ గెలిచింది! మన క్రికెటర్లకు అభినందనలు" అని ఆయన పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు దీనికి 1.07 లక్షలకు పైగా రీట్వీట్లు రాగా, సుమారు 2.5 కోట్ల ఇంప్రెషన్లు లభించాయి. ప్రధాని వ్యాఖ్యలకు ప్రజల నుంచి బలమైన మద్దతు లభిస్తోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

గతంలో పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై జరిపిన సైనిక చర్యకే 'ఆపరేషన్ సిందూర్' అని పేరు పెట్టారు. ఇప్పుడు క్రికెట్ విజయాన్ని సైతం అదే పేరుతో ప్రధాని ప్రస్తావించడం రాజకీయ దుమారం రేపింది. బీజేపీ మద్దతుదారులు, పలువురు నేతలు దీనిని 'న్యూ ఇండియా' దూకుడుకు నిదర్శనమని ప్రశంసిస్తుండగా, విపక్షాలు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. క్రికెట్‌ను బీజేపీ తన 'విభజన రాజకీయాలకు' వాడుకుంటోందని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్షవర్ధన్ పటేల్ ఆరోపించారు. క్రీడలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం సరికాదని ఆయన విమర్శించారు. అయితే, ఈ విమర్శల నడుమ కూడా నెటిజన్ల నుంచి ప్రధాని మోదీకి అనూహ్యమైన మద్దతు లభించడం గమనార్హం.

ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో విజయం సాధించిన భారత్ తొమ్మిదోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో మొదట పాకిస్థాన్ 113/1 పటిష్ఠ స్థితిలో ఉన్నప్పటికీ, కుల్దీప్ యాదవ్ అద్భుత బౌలింగ్‌తో 146 పరుగులకే కుప్పకూలింది. అనంతరం తిలక్ వర్మ (69 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌తో భారత్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.


More Telugu News