చిరంజీవి వల్లే నేను ఈ స్థాయికి వచ్చా: ప్రభుదేవా

  • జగపతిబాబు టాక్‌షోలో పాల్గొన్న నృత్య దర్శకుడు ప్రభుదేవా
  • తన విజయం వెనుక చిరంజీవి ప్రోత్సాహం ఎంతో ఉందని వెల్లడి
  • ఆయన కష్టపడే తీరే తనకు స్ఫూర్తి అని వ్యాఖ్య
భారతీయ చిత్ర పరిశ్రమలో తన డ్యాన్స్‌తో ఓ ప్రభంజనం సృష్టించిన కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా.. మెగాస్టార్ చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తన కెరీర్ తొలినాళ్లలో చిరంజీవి ఇచ్చిన ప్రోత్సాహం వల్లే తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని ఆయన అన్నారు. నటుడు జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే టాక్ షోలో పాల్గొన్న ప్రభుదేవా, పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా ప్రభుదేవా మాట్లాడుతూ.. "సినిమా ఇండస్ట్రీలో నాకు చిరంజీవి గారే ఆదర్శం. ఆయన కష్టపడే తీరును చూసి నేను ఎంతో నేర్చుకున్నాను. 'అత్తకు యముడు.. అమ్మాయికి మొగుడు' చిత్రంలోని 'మెరుపులా' పాటకు కొరియోగ్రఫీ చేసే అవకాశం నాకు వచ్చింది. అప్పుడు ఆయన డ్యాన్స్ మూమెంట్స్ చూసి నేనే ఆశ్చర్యపోయాను. ప్రతిభ ఉన్నవారిని ఆయనెప్పుడూ ప్రోత్సహిస్తారు. నాకు ఇంత గుర్తింపు రావడానికి ఆయనే కారణం" అని తెలిపారు.

అంతేకాకుండా, 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సినిమాలోని 'అబ్బనీ తీయని దెబ్బ' పాటకు తన తండ్రితో కలిసి పనిచేసిన విషయాన్ని కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. "ఆ సినిమా చేసేటప్పటికి నా వయసు కేవలం 15 ఏళ్లు. అప్పుడు నాకు స్టెప్పులు నేర్చుకోవడం, నా పని నేను చేసుకోవడం మాత్రమే తెలుసు" అని ప్రభుదేవా నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

ఇక తన కుమారుడు రిషి గురించి మాట్లాడుతూ.. "మా వంశంలో చాలామంది డ్యాన్సర్లు ఉన్నారు. కానీ నా కొడుకు మొదట్లో ఈ రంగంపై ఆసక్తి చూపలేదు. రెండేళ్ల క్రితం ఉన్నట్టుండి నటుడు అవుతానని చెప్పడంతో షాక్ అయ్యాను. ఈ రంగంలో నిలదొక్కుకోవడం చాలా కష్టం కాబట్టి, ముందు చదువు పూర్తి చేసి, ఆ తర్వాత సహాయ దర్శకుడిగా అనుభవం సంపాదించమని సలహా ఇచ్చాను" అని వెల్లడించారు. ప్రస్తుతం చిరంజీవిపై ప్రభుదేవా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 


More Telugu News