"మాకు, వాళ్లకు తేడా ఉండాలి కదా!": పాక్ కవ్వింపులపై సూర్య స్ట్రాంగ్ కౌంటర్

  • ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్ కవ్వింపు చర్యలు
  • పాక్ తీరుపై గట్టిగా స్పందించిన భారత కెప్టెన్ సూర్యకుమార్
  • ‘రెండు జట్లకు మధ్య తేడా ఉండాలి’ అంటూ ఘాటు వ్యాఖ్య
  • మేము ఎంతో హుందాగా ఆడామని స్పష్టం చేసిన సూర్య
  • సంక్షోభ సమయంలో బీసీసీఐ అండగా నిలిచిందని ప్రశంస
ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ ఆటగాళ్లు కవ్వింపు చర్యలకు పాల్పడినప్పటికీ, తాము మాత్రం ఎంతో హుందాగా వ్యవహరించామని భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. ఆటలో గెలుపోటములు సహజమని, కానీ తాము గౌరవంగా ఆడేందుకే ప్రాధాన్యత ఇచ్చామని ఆయన అన్నాడు. పాకిస్థాన్ జట్టు తీరును ఉద్దేశిస్తూ, "రెండు జట్లకు మధ్య తేడా ఉండాలి కదా" అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ ఒక జాతీయ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడాడు. మ్యాచ్ సమయంలో సల్మాన్ అలీ అఘా నేతృత్వంలోని పాక్ జట్టు భారత ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించిందని, వారి కవ్వింపులను ఎలా ఎదుర్కొన్నారని అడిగిన ప్రశ్నకు సూర్య పై విధంగా బదులిచ్చాడు.

"మేము ఎలాంటి సైగలు చేయలేదు, చేతులు ఊపలేదు. ఆటను గౌరవంగా ఆడాలనుకున్నాం. కానీ వాళ్లు మాత్రం బయట ప్రపంచానికి ఏదో సందేశం ఇవ్వాలని ప్రయత్నించారు. ఫలితం ఎవరికైనా అనుకూలంగా రావచ్చు. కానీ మైదానం వీడిన తర్వాత మనం పెట్టిన ఎఫర్ట్, ఆడిన ఆట పట్ల సంతోషంగా ఉండాలి. అదే మా లక్ష్యం" అని సూర్యకుమార్ వివరించాడు.

భావోద్వేగాలను పక్కనపెట్టి మంచి ఆట ఆడాలని తన సహచర ఆటగాళ్లకు సూచించినట్లు ఆయన తెలిపాడు. "బయట నుంచి చూసే వాళ్లకు ఎన్నో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ నేను మాత్రం ఆటగాళ్లతో ఒక్కటే చెప్పాను. మన ఎమోషన్స్ అదుపులో పెట్టుకుని మంచి గేమ్ ఆడుదాం. చివరికి ఫలితం ఏది వచ్చినా స్వీకరిద్దాం అని చెప్పాను" అని పేర్కొన్నాడు.

ఇదే సమయంలో ఈ టోర్నమెంట్ ఆద్యంతం తమ జట్టుకు కవచంలా అండగా నిలిచిన బీసీసీఐకి సూర్యకుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. భారత జట్టు తదుపరి స్థాయికి ఎదగడానికి ఇదే సరైన సమయమని అభిప్రాయపడ్డాడు.


More Telugu News