: డీఎస్పీగా ఎంపికైన యువతిని ఊరేగించిన గ్రామస్థులు

  • గ్రూప్ 1 లో మెరిసిన మానకొండూర్ యువతి మహేశ్వరి
  • నాలుగేళ్ల క్రితం తండ్రి మృతి.. తల్లి ప్రోత్సాహంతో గ్రూప్స్ లో విజయం
  • ఆరేళ్లుగా తెలంగాణ స్టడీ సర్కిల్ లో శిక్షణ తీసుకున్నట్లు వెల్లడి
పేద కుటుంబానికి చెందిన యువతి గ్రూప్ 1 లో విజేతగా నిలిచింది.. డీఎస్పీగా ఎంపికై నియామక పత్రంతో గ్రామంలో అడుగుపెట్టింది. గ్రామానికి పేరు తెచ్చిన ఆ యువతిని జనం ఓపెన్ టాప్ జీపులో ఊరేగించి సన్మానించారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ గ్రామంలో చోటుచేసుకుందీ ఘటన. వివరాల్లోకి వెళితే..

మానకొండూర్‌కు చెందిన మొదుంపల్లి మహేశ్వరి నిరుపేద కుటుంబానికి చెందిన యువతి. ఆమె తండ్రి లక్ష్మణ్‌ నాలుగేళ్ల క్రితమే గుండెపోటుతో చనిపోయారు. తల్లి శంకరమ్మ కూలి పనులు చేస్తూ మహేశ్వరిని చదివించింది. పదో తరగతి వరకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్, డిగ్రీ స్థానిక ప్రైవేటు కళాశాలల్లో చదివిన మహేశ్వరి.. గోదావరిఖనిలో పీజీ పూర్తిచేశారు. తల్లి ప్రోత్సాహంతో తెలంగాణ స్టడీ సర్కిల్ లో చేరి ఆరేళ్లుగా గ్రూప్స్ పరీక్షలకు శిక్షణ తీసుకున్నారు. ఇటీవల జరిగిన పరీక్షల్లో విజయం సాధించి డీఎస్పీగా ఎంపికయ్యారు.

ఆదివారం సాయంత్రం నియామక పత్రంతో గ్రామానికి చేరుకున్న మహేశ్వరికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్, జగ్జీవన్‌రాం విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత ఓపెన్‌ టాప్‌ జీపులో మహేశ్వరిని ఊరేగించారు. అనంతరం తూర్పు దర్వాజ వద్ద గ్రామస్థులు, జిల్లా మాదిగ ఉద్యోగుల సంఘం, అంబేడ్కర్‌ సంఘం నాయకులు, మహిళలు మహేశ్వరిని సన్మానించారు. ఈ సందర్భంగా మహేశ్వరి మాట్లాడుతూ.. జీవితాలను మార్చే శక్తి విద్యకే ఉందన్నారు.

More Telugu News