: నా ఆలోచనా విధానాన్ని మార్చుకున్నా: సమంత

  • సమంత తాజా ఇన్ స్టా పోస్టు సోషల్ మీడియాలో వైరల్
  • ఇరవై ఏళ్ల వయసులో విశ్రాంతి లేకుండా గందరగోళంగా గడిపానన్న సమంత
  • ప్రతి అమ్మాయి తనలాంటి దృక్పథాన్ని అలవరచుకోవాలని అకాంక్ష
టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. జీవితం, ప్రేమ, ఆత్మవిశ్వాసం గురించి ఆమె రాసిన మాటలు అభిమానుల హృదయాలను ఆకట్టుకున్నాయి.
 
 ఇరవైల్లో గందరగోళం – ముప్పైల్లో స్పష్టత

సమంత తన ఇన్‌స్టా పోస్ట్‌ లో ఇలా రాసుకొచ్చింది. “ఇరవై ఏళ్ల వయసులో నేను విశ్రాంతి లేకుండా గందరగోళంగా గడిపాను. గుర్తింపు కోసం ఆరాటపడ్డాను. ఆ సమయంలో నన్ను నేనే ఎంత కోల్పోయానో ఎవరికీ తెలియదు. పైకి ఏదీ కనిపించకుండా ఉండేందుకు ఎంతో కష్టపడ్డాను” అంతేకాక, నిజమైన ప్రేమ గురించి ఆ వయసులో ఎవరూ చెప్పలేదని పేర్కొంది. “ప్రేమ బయట నుంచి రాదు. నిజమైన ప్రేమ మనలోనే ఉంటుంది. మనల్ని మనం ప్రేమించుకోవడమే నిజమైన ప్రేమ” అని సమంత స్పష్టం చేశారు.
 
ముప్పైల్లో మానసిక పరిపక్వత

ఇప్పుడు ముప్పైల్లోకి వచ్చిన తర్వాత తన ఆలోచనా విధానం పూర్తిగా మారిందని సమంత చెబుతోంది. “గతంలో చేసిన తప్పుల జ్ఞాపకాలను మోయడం మానేశాను. అన్నింటి వెంట పరుగులు పెట్టడం ఆపేశాను. పబ్లిక్‌లో ఒకలా, ఒంటరిగా మరోలా ఉండడం మానేశాను, ప్రతి అమ్మాయి నాలాంటి దృక్పథాన్ని అలవరచుకోవాలి"  ఆమె ఆకాంక్షించారు. “పరుగులు తీయడం ఆపేసి జీవితాన్ని ఆస్వాదించాలి. మీరు మీలా ఉన్నప్పుడే గర్వంగా, ధైర్యంగా, ఆనందంగా ఉండగలరు. అప్పుడే స్వేచ్ఛగా జీవించగలరు” అని ఆమె రాసుకొచ్చారు.
 
అభిమానులను ఆకట్టుకుంటున్న నిజాయతీ

సమంత వ్యక్తిగత అనుభవాల నుంచి రాసుకొచ్చిన ఈ పోస్ట్ మహిళల్లో కొత్త ఆలోచనలకు దారి తీస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆమె బహిరంగంగా పంచుకున్న భావాలు, ఆత్మవిశ్వాసం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తాయని అంటున్నారు. 

More Telugu News