వేలు తెగితే 50 రూపాయలకే చికిత్స... భారత్ లో వైద్యంపై అమెరికన్ యువతి వీడియో వైరల్!

  • భారత వైద్య వ్యవస్థపై అమెరికన్ మహిళ ప్రశంసలు
  • కూరగాయలు కోస్తూ తెగిన బొటనవేలుకు చికిత్స
  • ఆసుపత్రిలో కేవలం రూ. 50 ఖర్చు అయిందని వెల్లడి
  • అమెరికాలోని ఖరీదైన వైద్యంతో పోల్చుతూ పోస్ట్
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఇన్స్టాగ్రామ్ వీడియో
మన దేశ వైద్య వ్యవస్థను ఓ అమెరికన్ మహిళ ఆకాశానికెత్తేశారు. భారత్‌లో వైద్యం ఎంత సులభంగా, చౌకగా లభిస్తుందో వివరిస్తూ ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. కేవలం 50 రూపాయలకే తనకు అద్భుతమైన వైద్యం అందిందని చెప్పడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

వివరాల్లోకి వెళితే, క్రిస్టెన్ ఫిషర్ అనే అమెరికన్ మహిళ గత నాలుగేళ్లుగా భారతదేశంలో నివసిస్తున్నారు. ఇటీవల ఇంట్లో కూరగాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె బొటనవేలు తెగింది. తీవ్రంగా రక్తస్రావం కావడంతో, ఆమె కంగారు పడకుండా తన సైకిల్‌పై ఇంటికి దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు వెంటనే స్పందించి ఆమెకు చికిత్స అందించారు.

మొత్తం 45 నిమిషాల్లోనే చికిత్స పూర్తయిందని, అదృష్టవశాత్తు కుట్లు వేయాల్సిన అవసరం కూడా రాలేదని క్రిస్టెన్ తెలిపారు. ఈ మొత్తం చికిత్సకు అయిన ఖర్చు కేవలం 50 రూపాయలేనని (సుమారు 60 సెంట్లు) తెలుసుకుని ఆమె ఆశ్చర్యపోయారు. "నా వేలు తెగింది, రక్తం బాగా పోయింది. సైకిల్‌పై ఆసుపత్రికి వెళ్లాను. 45 నిమిషాల్లో పని పూర్తయింది. 50 రూపాయలు చెల్లించి ఇంటికి వచ్చేశా" అని ఆమె తన అనుభవాన్ని ఇన్స్టాగ్రామ్ వీడియోలో పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె అమెరికాలోని ఖరీదైన వైద్యంతో భారత వైద్య వ్యవస్థను పోల్చారు. "అమెరికాలో కేవలం ఆరోగ్య బీమా ప్రీమియంలకే నెలకు 1000 నుంచి 2000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ నా మొత్తం చికిత్సకు 60 సెంట్లు మాత్రమే అయింది. అమెరికాతో పోలిస్తే ఇండియాలో వైద్యం చాలా అందుబాటులో ఉంది" అని ఆమె పేర్కొన్నారు.

క్రిస్టెన్ పోస్ట్ చేసిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. భారత వైద్య వ్యవస్థ గొప్పతనాన్ని పలువురు కొనియాడుతున్నారు. అమెరికాలో వైద్యం కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వస్తుందని, ఇక్కడ అలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా వైద్యం అందుతుందని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.


More Telugu News