చంద్రయ్య కుమారుడి ఉద్యోగ బిల్లును వ్యతిరేకించిన వైసీపీ

  • టీడీపీ నేత చంద్రయ్య కుమారుడి ఉద్యోగ బిల్లుపై శాసనమండలిలో తీవ్ర చర్చ
  • ఫ్యాక్షన్‌కు ప్రోత్సహించడమే అవుతుందన్న బొత్సా సత్యనారాయణ
  • బిల్లు రిజర్వులో పెట్టిన మండలి చైర్మన్ మోషేన్ రాజు
పల్నాడు జిల్లాలో హత్యకు గురైన టీడీపీ నేత తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించే సవరణ బిల్లును వైసీపీ అడ్డుకుంది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఈ సవరణ బిల్లుపై తీవ్ర చర్చ జరిగింది. ప్రతిపక్ష వైసీపీ ఈ బిల్లును వ్యతిరేకించడంతో అధికార పక్షం తీవ్రంగా స్పందించింది.

బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల

మంత్రి పయ్యావుల కేశవ్ శాసన మండలిలో ఏపీ పబ్లిక్ సర్వీసుల నియామకాల క్రమబద్ధీకరణ రెండవ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. "పల్నాడు జిల్లాలో రాజకీయంగా ప్రేరేపిత ఘర్షణల్లో తోట చంద్రయ్య మృతి చెందారు. ఆయన కుమారుడు తోట వీరాంజనేయులును జూనియర్ అసిస్టెంట్‌గా నియమించాలన్నది ప్రభుత్వ నిర్ణయం. గతంలో ఫ్యాక్షన్ హింసలకు గురైన కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చిన ఉదాహరణలు ఉన్నాయి. అదే రీతిలో ఇప్పుడు కూడా ఇది ఒక న్యాయమైన చర్య" అని పేర్కొన్నారు. దీనికి సంబంధించి బిల్లులో చేసిన సవరణలను ఆమోదించాలని కోరారు.

వైసీపీ వ్యతిరేకత – “ఫ్యాక్షన్‌కు ప్రోత్సాహమే!”

శాసనమండలిలో విపక్ష నేత (వైసీపీ) బొత్స సత్యనారాయణ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. "ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత బిల్లు. మాకు మానవత్వం ఉంది. కానీ ఈ విధంగా శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వడం వలన భవిష్యత్తులో రాజకీయ హింసను ప్రోత్సహించే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. చట్ట సవరణల ద్వారా ఇలా చేయడం సరికాదు. ప్రభుత్వం దీనిని పునఃపరిశీలించాలి" అంటూ ఆయన బిల్లుపై డివిజన్ (వోటింగ్) కోరారు.

మండలి చైర్మన్ జోక్యం – బిల్లు రిజర్వ్‌లో

ఈ వివాదం నేపథ్యంలో మండలి చైర్మన్ మోషేన్ రాజు బిల్లు మీద డిస్కషన్‌ను నిలిపివేస్తూ, బిల్లును రిజర్వ్‌లో ఉంచినట్లు ప్రకటించారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేశారు.

వైసీపీ ఎమ్మెల్సీ ఏసురత్నం మద్దతు

అయితే, ఈ బిల్లుకు వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఏసురత్నం మద్దతు ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ.. "చంద్రయ్య మా ప్రాంతానికి చెందినవారు. నక్సల్స్ బాధితులకు, విధుల్లో చనిపోయినవారికి బెనిఫిట్స్ ఇస్తున్నారు. ఇదే రీతిలో చంద్రయ్య కుటుంబానికి న్యాయం చేయడంలో తప్పేం లేదు. ఇది మంచి ప్రతిపాదనగా భావించాలి. రాజకీయం కాదు" అని పేర్కొన్నారు. 


More Telugu News