పిన్నెల్లి సోదరులను దాదాపు 10 గంటల పాటు విచారించిన పోలీసులు

  • జంట హత్య కేసులో నిందితులుగా ఉన్న పిన్నెల్లి బ్రదర్స్ 
  • గురజాల డీఎస్పీ జగదీశ్ ఆధ్వర్యంలో నిందితుల విచారణ
  • ఈ ఏడాది మే నెలలో టీడీపీ వర్గీయులు జవిశెట్టి వెంకటేశ్వర్లు, అతని సోదరుడు కోటేశ్వరరావు దారుణ హత్య
  • ఈ కేసులో ఏడుగురిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు
పల్నాడు జిల్లా గుండ్లపాడు గ్రామంలో సంచలనం సృష్టించిన జంట హత్య కేసులో నిందితులుగా ఉన్న వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలను పోలీసులు దాదాపు పది గంటల పాటు విచారించారు.

గురజాల డీఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో నిన్న ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ప్రశ్నించారు. అనంతరం రాత్రి వరకు ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిని పోలీసులు విచారించారు.

దారుణ హత్యల నేపథ్యం

గుండ్లపాడుకు చెందిన తెదేపా వర్గీయులు జవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్య, అతని సోదరుడు జవిశెట్టి కోటేశ్వరరావు ఈ ఏడాది మే నెలలో తెలంగాణలోని హుజూర్‌నగర్‌లో ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.

ఈ కేసులో పోలీసులు ఏడుగురిని ప్రధాన నిందితులుగా గుర్తించారు. ఎ-1గా జవిశెట్టి శ్రీను, ఎ-2గా తోట వెంకట్రావు, ఎ-3గా తోట గురవయ్య, ఎ-4గా నాగరాజు, ఎ-5గా తోట వెంకటేశ్వర్లు, ఎ-6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎ-7గా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలను పేర్కొన్నారు. 


More Telugu News