ఇక్కడ ఎవరున్నారో ఆ మౌలానా మరిచిపోయినట్లున్నారు: యోగి ఆదిత్యనాథ్

  • "ఐ లవ్ మహమ్మద్" ప్రచారానికి మద్దతుగా పిలుపునిచ్చిన ఇత్తెహాద్ ఎ మిల్లత్ కౌన్సిల్ చీఫ్ మతాధికారి
  • మతాధికారిని అరెస్టు చేసిన పోలీసులు
  • వ్యవస్థను అడ్డుకుంటామంటే గుణపాఠం చెప్పి తీరుతామన్న ముఖ్యమంత్రి
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో పోలీసులు, స్థానికుల మధ్య జరిగిన హింసాత్మక ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. వ్యవస్థను ఎవరు అడ్డుకున్నా తమ ప్రభుత్వం అమలు చేసే శిక్ష కఠినంగా ఉంటుందని హెచ్చరించారు. శనివారం జరిగిన 'వికసిత్ యూపీ' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, "ఐ లవ్ మహమ్మద్" ప్రచారానికి మద్దతుగా నిరసనకు పిలుపునిచ్చిన ఇత్తెహాద్ ఎ మిల్లత్ కౌన్సిల్ చీఫ్ మతాధికారి తౌకీర్ రజా ఖాన్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

"నిన్న, ఒక మౌలానా రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నారో మరిచినట్లున్నారు. ఈ వ్యవస్థను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేస్తానని అనుకుంటున్నారేమో. కానీ మేం ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. రోడ్ల దిగ్బంధం కావొచ్చు, కర్ఫ్యూ కావొచ్చు, అల్లర్లకు పాల్పడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునేలా మేం గట్టిగా గుణపాఠం చెప్పి తీరుతాం" అని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

రాష్ట్రంలో 2017కు ముందు వ్యవస్థను నిలిపివేసే పరిస్థితి ఉండేదని, కానీ ఆ తర్వాత ఒక్క కర్ఫ్యూని కూడా తాము అనుమతించడం లేదని స్పష్టం చేశారు. అప్పటి నుంచే ఉత్తరప్రదేశ్ అభివృద్ధి కథ మొదలైందని అన్నారు.

పోలీసులు అదుపులో తౌకీర్

కాగా, పోలీసులు తౌకీర్‌ను అదుపులోకి తీసుకుని కస్టడీకి తరలించారు. "తౌకీర్ రజాను అదుపులోకి తీసుకున్నాం. చట్టపరమైన చర్యలు కొనసాగుతాయి. అంతా ప్రశాంతంగానే ఉంది. పరిస్థితి నియంత్రణలో ఉంది" అని బరేలీ ఎస్ఎస్పీ అనురాగ్ ఆర్య మీడియాకు తెలిపారు.


More Telugu News