చిరంజీవి చెప్పిందే కరెక్ట్... ఆయనను ఎవరూ అవమానించలేదు: ఆర్.నారాయణమూర్తి

  • ఏపీ అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్, నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యల వివాదం
  • స్పందించిన ఆర్. నారాయణమూర్తి
  • చిరంజీవిని జగన్ అవమానించలేదని, గౌరవించారని వెల్లడి
  • తమ సమస్యల పట్ల జగన్ సానుకూలంగా స్పందించారని వివరణ 
  • అయితే పరిశ్రమలో అప్పుడున్న సమస్యలే ఇప్పుడూ ఉన్నాయని ఆవేదన
  • చంద్రబాబు, పవన్, దుర్గేశ్ పరిష్కరించాలని విజ్ఞప్తి 
ఏపీ అసెంబ్లీలో కొందరు పెద్దలు చేసిన వ్యాఖ్యల పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందించిన తీరు నూటికి నూరు శాతం కరెక్ట్ అని ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఆయనను ఎవరూ అవమానించలేదని స్పష్టం చేశారు.

గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు జరిగిన సమావేశాన్ని నారాయణమూర్తి గుర్తుచేసుకున్నారు. "కరోనా మహమ్మారి కారణంగా పరిశ్రమ భవిష్యత్తు ఏమిటోనన్న ఆందోళన నెలకొన్నప్పుడు, చిరంజీవి గారే చొరవ తీసుకుని అప్పటి సీఎం జగన్‌తో సమావేశం ఏర్పాటుకు కృషి చేశారు. చిరంజీవి ఫోన్ చేసి ఆ భేటీకి నన్ను కూడా పిలిచారు. చిన్న సినిమాలు బతకాలని, నిర్మాతలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఆ క్లిష్ట సమయంలో పరిశ్రమకు అండగా నిలిచిన చిరంజీవికి సెల్యూట్ చేస్తున్నాను" అని నారాయణమూర్తి వివరించారు.

ఆ సమావేశంలో చిరంజీవిని ఎవరూ అవమానించలేదని, జగన్ ఆయనను గౌరవించారని నారాయణమూర్తి స్పష్టం చేశారు. "జగన్ గారు చిరంజీవిని కానీ, మరెవరినీ కానీ అవమానించలేదు. మా సమస్యలను ఓపిగ్గా విని, పరిశ్రమకు ఏం కావాలో అది చేస్తామని సానుకూలంగా హామీ ఇచ్చారు," అని తెలిపారు.

అయితే, అప్పుడు సినీ పరిశ్రమ ఎదుర్కొన్న సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఈ సమస్యలపై దృష్టి సారించి, వాటిని పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


More Telugu News