దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ 4జీ... సీఎం చంద్రబాబు స్పందన

  • విజయవాడలో బీఎస్ఎన్ఎల్ 4జీ సేవల ప్రారంభోత్సవం
  • కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పెమ్మసాని
  • భద్రతకు క్వాంటం కంప్యూటింగ్ ఎంతో అవసరమని వ్యాఖ్య
  • టెక్నాలజీ మార్పును ఎవరూ ఆపలేరని స్పష్టం చేసిన చంద్రబాబు
విజయవాడలో శనివారం జరిగిన బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ నెట్‌వర్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్వాంటం మిషన్‌ను ముందుకు తీసుకెళ్తున్నారని గుర్తుచేశారు. అందులో భాగంగానే అమరావతిలో ఈ అత్యాధునిక కంప్యూటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, బీఎస్ఎన్ఎల్ అధికారులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సాంకేతిక రంగంలో ప్రతి పదేళ్లకు ఒకసారి కొత్త ఆవిష్కరణలు వస్తుంటాయని, టెక్నాలజీలో మార్పును ఎవరూ ఆపలేరని అన్నారు. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవల ప్రారంభంతో ప్రభుత్వ రంగ సంస్థ సేవలు మరింత విస్తృతం అయ్యాయని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన 4జీ టెక్నాలజీని ప్రారంభించడం శుభపరిణామమని అన్నారు.

ఇక, వచ్చే ఏడాది జనవరి నాటికి అమరావతిలో రాష్ట్రంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. భవిష్యత్తులో భద్రతా పరమైన అంశాలకు క్వాంటం కంప్యూటింగ్ వ్యవస్థలు ఎంతో కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.



More Telugu News