పవన్‌ను పొగిడిన రవిప్రకాశ్.. ఒక్కమాటతో కౌంటర్ ఇచ్చిన పూనమ్ కౌంటర్

  • పవన్ 'ఓజీ' చిత్రంపై రవిప్రకాశ్ ప్రశంసల ట్వీట్
  • "షేమ్ ఆన్ యూ" అంటూ ఘాటుగా స్పందించిన పూనమ్ కౌర్
  • సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన ట్వీట్ల వార్
  • గతంలోనూ రవిప్రకాశ్ ను టార్గెట్ చేసిన నటి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'ఓజీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేస్తున్న నేపథ్యంలో ఆర్టీవీ అధినేత రవిప్రకాశ్ చేసిన ఓ ట్వీట్‌కు నటి పూనమ్ కౌర్ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. పవన్ నటన, మేనరిజమ్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.154 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు పవన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇదే క్రమంలో ఆర్టీవీ అధినేత రవిప్రకాశ్ ట్విట్టర్ వేదికగా పవన్ కల్యాణ్‌ను అభినందించారు. "మీరు ఎప్పటికీ ఓజీనే. ఎల్లప్పుడూ ప్రజల ఛాంపియన్‌గా నిలుస్తారు. మీ విజయానికి, మీరు సాధిస్తున్న భారీ వసూళ్లకు అభినందనలు పవన్ కల్యాణ్" అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

అయితే, ఈ ట్వీట్‌కు నటి పూనమ్ కౌర్ స్పందిస్తూ "షేమ్ ఆన్ యూ!" (మీకు సిగ్గుచేటు) అని ఒక్క పదంతో ఘాటుగా బదులిచ్చారు. ఆమె ఎందుకలా స్పందించారో అర్థం కాక నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

వాస్తవానికి పూనమ్ కౌర్, రవిప్రకాశ్ ను టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో మంత్రి కొండా సురేఖ, సమంత-నాగచైతన్యలపై చేసిన వ్యాఖ్యల విషయంలోనూ రవిప్రకాశ్ స్పందించారు. "స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. కానీ, రాజకీయాలు దిగజారుతున్నాయి" అంటూ ఆయన ట్వీట్ చేయగా, దానికి పూనమ్ తీవ్రంగా బదులిచ్చారు. "నిజానిజాలు తెలుసుకోకుండా మీ ఛానెల్‌లో ప్రసారం చేసే కార్యక్రమాల వల్ల నా జీవితం నాశనమైంది. దయచేసి మీరు నోరు మూసుకుంటే మంచిది" అని ఆమె అప్పట్లో విమర్శించారు.


More Telugu News